“బుల్లెట్” స్పీడ్‌తో..

  • భగవాన్ శ్రీ సత్య సాయి శత జయంతి ఉత్సవాల పనులు
  • ప‌ర్య‌వేక్షించిన కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్

అనంత‌పురం, ఆంధ్రప్రభ : జిల్లా పరిపాలన యంత్రాంగం మొత్తానికి రథసారధి ఒకరు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు రథసారధి మరొకరు. వీరిలో ఒకరు జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్, మరొకరు జిల్లా ఎస్పీ స‌తీష్ కుమార్. భగవాన్ శ్రీ సత్య సాయి శత జయంతి ఉత్సవాల పనులు పూర్తి చేయడమే లక్ష్యంగా.. తమ హోదాలను మరచి… ద్విచక్ర వాహనంపై బుధవారం పుట్టపర్తిలో విస్తృతంగా పర్యటించి పనులను పరిశీలించారు.

వివరాల్లోకి వెళితే…
కలెక్టర్ ఏ.శ్యాం ప్రసాద్ ‘బుల్లెట్’ ద్విచక్ర వాహనంలో ఎస్పీ ఎస్. సతీష్ కుమార్‌ను వెనుక కూర్చోబెట్టుకొని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిలో చేపట్టిన వివిధ పనులను పరిశీలించారు. పుట్టపర్తి లోని పెట్రోల్ బంక్ వద్ద నుంచి మొదలుపెట్టి, పెరేడ్ గ్రౌండ్ దారిలో ఎడమవైపు పార్కింగ్ ఏరియా, పోలీస్ పెరేడ్ గ్రౌండ్, వెస్ట్ గేట్ వద్ద చింత తోపు, చిన్నపల్లి స్కూల్ వద్ద పార్కింగ్ ఏరియాలలో చేస్తున్న ఏర్పాట్లను, భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి సూచ‌న‌లు చేశారు. ఈ సందర్భంగా పార్కింగ్ ఏరియాలలో మరుగు తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీరు, ముఖ్యంగా లైటింగ్ ఏర్పాట్లను 13వ తేదీలోగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్‌డ‌బ్ల్యూఎస్, విద్యుత్‌, పంచాయతీ శాఖల అధికారులను ఆదేశించారు. అలాగే డస్ట్ బిన్స్ ఏర్పాటు చేసి పారిశుధ్యాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. ఎయిర్ పోర్టు, హెలిపాడ్, రైల్వే స్టేషన్, కర్ణాటక నాగేపల్లి నుంచి పుట్టపర్తి వచ్చే రోడ్డు, ఎయిర్ పోర్ట్ నుంచి గణేష్ సర్కిల్ వరకు రోడ్డు పక్కన జంగిల్ క్లియరెన్స్ చేసి, చెత్తను, విరిగిపోయిన కొమ్మలను తొలగించి అద్దంలా ఉంచాలని సూచించారు.

చిత్రావతి నది ఆవలి వైపు చదును చేసి, గ్రావెల్ వేసి అభివృద్ధి చేయాలన్నారు. పార్కింగ్ ప్రదేశాల వద్ద కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలు బయట ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను ఎక్కడెక్కడ పార్కింగ్ ఏరియాలలో ఉంచాలో తెలిసే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే అక్కడ ఒక హెల్ప్ డెస్క్, పురుషులు, మహిళలకు విడివిడిగా తాత్కాలిక మరుగుదొడ్లు, అవి తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పార్కింగ్ ఏరియా వద్ద అవసరమైన మేరకు లైటింగ్ ఉండాలని సూచించారు. అలాగే 24- 7 ప్రకారం తాగునీరు అందుబాటులో ఉంచాలని, ఇందుకు షిఫ్టులవారీగా సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆర్‌డ‌బ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. ప్రతిచోట ఫుడ్ అరేంజ్మెంట్స్ ఉండాలని, ఆహారం తిన్న తర్వాత ఎక్కడపడితే అక్కడ పడి వేయకుండా డస్ట్ బిన్స్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తొలగించి పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్, పబ్లిక్ హెల్త్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. అనంతరం హిల్ యు స్టేడియంలో జరుగుతున్న పనులను కలెక్టర్, ఎస్పీలు పరిశీలించి వివిధ అంశాలలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు సూచనలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు సువర్ణ, మహేష్, ఆర్టీఓ కరుణసాగర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ క్రాంతి, పబ్లిక్ హెల్త్ డీఈ నరసింహ, డీపీఓ సమత, తహసీల్దార్ కళ్యాణ్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు, ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply