WindPower | కరువు నేలల్లో ‘వెలుగుల పంట’కు శ్రీకారం

WindPower | కరువు నేలల్లో ‘వెలుగుల పంట’కు శ్రీకారం
WindPower | రాయలసీమలో సౌర–పవన ప్రాజెక్టులకు కేంద్రం ఊపు
రైతు భూములకు రక్షణ – నష్టపరిహారం నేరుగా ఖాతాల్లోకి
పవర్ కారిడార్‌లతో ప్రాంతీయ అభివృద్ధికి బాటలు
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అన్న భావనతో రైతన్న భూమి ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దేశ అభివృద్ధికి దోహదపడే సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో పవర్ ప్రాజెక్టులకు ఊపునిస్తూ, రైతుల ప్రయోజనాలను కాపాడే విధంగా ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తోంది. “నీ భూమికి నీవే రారాజు” అన్న నినాదంతో రైతుల్లో అపోహలు తొలగించి, అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దేశాన్ని ఆధునిక, సాంకేతిక శక్తిగా తీర్చిదిద్దే దిశగా సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి కీలక పాత్ర పోషిస్తుందని కేంద్రం భావిస్తోంది.
WindPower | అపోహలకు చెక్ – రైతుల భాగస్వామ్యంతో అభివృద్ధి
పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు పర్యావరణ అనుకూల శక్తి వనరులను విస్తరించేందుకు పవర్ కారిడార్‌ల నిర్మాణం, సౌర పార్కులు, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులను వేగంగా చేపడుతోంది. ఇందుకోసం ఎంపిక చేసిన ప్రాంతాల్లో భూముల సేకరణలో రైతులకు అన్యాయం జరగకుండా నేరుగా వారి ఖాతాల్లో నష్టపరిహారం చెల్లించే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాలు, కరువు సమస్యలతో కష్టాలు ఎదుర్కొంటున్న రైతులకు అదనపు ఆదాయం కల్పించే అవకాశంగా ఈ ప్రాజెక్టులను ప్రభుత్వం చూస్తోంది. పంటలతో పాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా స్థిరమైన ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.

రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ భూముల్లో విద్యుత్ ప్రాజెక్టులకు సహకరిస్తే, వారికి ఆర్థిక భద్రతతో పాటు అభివృద్ధి అవకాశాలు కూడా పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, ఈ ప్రాజెక్టులపై కొందరు రాజకీయ వర్గాలు అపోహలు సృష్టిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిఘా విభాగాలను అప్రమత్తం చేసి, ముసుగు రాజకీయాలకు చెక్ పెట్టే దిశగా చర్యలు చేపడుతున్నాయి. ప్రాజెక్టుల అమలుకు అడ్డంకులు కలిగించే అంశాలపై రహస్య నివేదికలు సేకరించి, అవసరమైన చర్యలు తీసుకునేలా చర్యలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమ ప్రాంతం దేశంలో అత్యంత కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

ఒకప్పుడు రత్నాల సీమగా పేరుగాంచిన ఈ నేల, వరుస కరువులతో రైతుల జీవనోపాధిని దెబ్బతీసింది. సాగుకు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో అనేక భూములు బీడుగా మారిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులు కరువు నేలల్లో కొత్త ఆశను నింపుతున్నాయి. ఎడారిలా మారిన ప్రాంతాల్లో కూడా సౌర విద్యుత్ ఉత్పత్తికి విస్తృత అవకాశాలు ఉండటంతో, వాటిని వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కరువు నేలల్లో పంటలతో పాటు విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా రైతులకు ద్వంద్వ ప్రయోజనం కల్పించే లక్ష్యంతో ప్రాజెక్టులను రూపొందించింది. దీని ద్వారా స్థానిక ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి ఊతం లభిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. విద్యుత్ కారిడార్‌ల నిర్మాణంతో కొత్త పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సౌర, పవన శక్తి వినియోగం పెరగడం ద్వారా విద్యుత్ దిగుమతులపై ఆధారపడే అవసరం తగ్గి, దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా లాభం చేకూరుతుందని చెబుతున్నారు.
రైతుల భూములకు నష్టం జరగకుండా పారదర్శక విధానాలు అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది. నష్టపరిహారం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో పాటు, ప్రాజెక్టుల్లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. రైతుల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించడమే లక్ష్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కరువు కాటేసిన రాయలసీమలో ఇప్పుడు “అనంత కోటి వెలుగులు” వెలిగించే సౌర, పవన ప్రాజెక్టులు కొత్త ఆశలను రగిలిస్తున్నాయి. పంటలతో పాటు విద్యుత్ వెలుగుల పంటలు పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న ఆశతో అన్నదాతలు ముందుకు సాగుతున్నారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, రైతుల సంక్షేమం అనే మూడు లక్ష్యాలను సమన్వయం చేస్తూ ఈ పవర్ ప్రాజెక్టులు ప్రాంత భవిష్యత్తును మార్చే దిశగా అడుగులు వేస్తున్నాయి.
