Wildlife Act | జేసీబీ సీజ్ చేయడానికి వెళ్లిన అటవీ అధికార్లు..

Wildlife Act | జేసీబీ సీజ్ చేయడానికి వెళ్లిన అటవీ అధికార్లు..
- పెట్రోల్ తో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ యజమాని..
Wildlife Act | జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని బాదంపల్లికి చెందిన యెoబడి శేఖర్ పుట్టిగూడ గ్రామ సమీపాన ఉన్న భూమిలో అక్రమంగా మొరం తవ్వారని జేసీబీని సీజ్ చేయడానికి అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక అటవీశాఖ అధికారులు మంగళవారం శేఖర్ ఇంటికి వెళ్లారు. దీంతో శేఖర్ తన జేసీబీని తీసుకెళ్తే చనిపోతానని ఒంటి మీద పెట్రోల్(Petrol) పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడగా, అక్కడే ఉన్న కొందరు గ్రామస్తులు అడ్డుకొని యువకున్ని కాపాడారు.
ఈ సందర్భంగా జేసీబీ యజమాని శేఖర్ మాట్లాడుతూ గత ఆదివారం పుట్టిగూడ గ్రామ సమీపంలోని బాలునాయక్ పట్టా భూమిలో జేసీబీతో మట్టితవ్వి ఆ మట్టిని ట్రాక్టర్ల ద్వారా నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు తరలించానన్నారు. అదేరోజు అక్కడికి వచ్చిన అటవీ అధికారులు జేసీబీ(JCB) తాళం చెవులను తీసుకొని వెళ్లారని ఆయన చెప్పారు.
తాను ఆ గ్రామ రైతు బాలునాయక్ ను తీసుకొని పట్టా పాస్ పుస్తకంతో వెళ్లి అటవీ అధికారులకు చూపించడంతో ఆ తాళంచెవులు తిరిగి ఇచ్చారని ఆయన తెలిపారు. యధావిధిగా ఎప్పటిలాగే పనిచేసుకుంటున్న తన వద్దకు మళ్లీ ఈ రోజు అటవీ అధికారులు వచ్చి జేసీబీని సీజ్ చేస్తామని తాళంచెవులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని ఆయన చెప్పారు.
ఎలాంటి ఆధారం లేని నాకు జేసీబీ ద్వారానే పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, అటవీ అధికార్లు(Forest Officers జేసీబీని సీజ్ చేస్తే తనకు ఆత్మహత్య తప్పా వేరే మార్గంలేదని ఆయన తెలిపారు. ఈ విషయమై స్థానిక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కె. లక్ష్మీనారాయణను సాయంత్రం ఫోన్లో సంప్రదించగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జేసీబీ సీజ్ చేయడానికి బాదంపల్లికి తమ అటవీ అధికారును పంపించామన్నారు.

కవ్వాల టైగర్ రిజర్వ్ ఎకో సెన్సిటివ్ జోన్ 10 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి తవ్వకాలు నిర్వహించకూడదని ఆయన చెప్పారు. వైల్డ్ లైఫ్ యాక్ట్(Wildlife Act), ఫారెస్ట్ యాక్ట్, వాల్టా చట్టం ప్రకారం అడవికి సమీపాన మట్టిని,ఇసుకను తవ్వకూడదని ఆయన చెప్పారు.అలా చేసినందువల్లనే బాదంపల్లిలో జేసీబీని సీజ్ చేయడానికి తమ అధికారులు అక్కడికి వెళ్లారని ఆయన తెలిపారు.
