నంద్యాల బ్యూరో, జులై 23 (ఆంధ్రప్రభ) : నేటి కలియుగంలో ప్రేమ, అభిమానం, ఆప్యాయత అనుబంధం, నశించిపోతున్నాయనడానికి, ఈ హత్య ఓ ఉదంతంగా పేర్కొనవచ్చు. చిన్న చిన్న మనస్పర్ధలున్నా కుటుంబాలు సర్దుకోవాల్సిన ఈ రోజుల్లో హత్యలు జరుగుతున్నాయంటే.. మానవతా విలువలు రోజుకు దిగజారిపోతున్నాయనే, మానవ సంబంధాలు వ్యక్తిగత కక్షలుగా మారి కొట్టుకుంటూ చావు వరకు వచ్చాయంటే ఈ సమాజం ఏమైపోతుందో, ఈ సంఘటన రుజువు చేస్తుంది.
వైవాహిక జీవితాల్లో మనస్పర్థలు పెరిగిపోతున్నాయి. దీంతో క్షణాకావేశంలో కొందరు భార్యలు పక్కాప్లాన్‌తో భర్తలని అతి కిరాతకంగా చంపేస్తున్నారు. ఆ తర్వాత దానిని హత్యగా, ప్రమాదాలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల (Nandyala) జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లాలోని నూనెపల్లె (Noonepalli) రమణ (50)తో, పల్నాడు జిల్లా (Palnadu District) పిడుగురాల్లకు చెందిన రవణమ్మకి వివాహం జరిగింది. పెళ్లి అయిన తర్వాత వీరి వివాహా బంధంలో తరచుగా మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. అయితే భర్త రమణ ప్రవర్తనతో విసిగిపోయిన భార్య రవణమ్మ.. తన భర్తని అంతమొందించాలని ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే భర్తతో వచ్చిన గొడవలతో పుట్టింటికి వెళ్లింది రవణమ్మ.
భార్యను తీసుకురావడానికి పిడుగురాళ్ల (piduguralla) కు వెళ్లాడు రమణ. అయితే ఈ నేపథ్యంలో మరోసారి ఘర్షణ పడ్డారు భార్యభర్తలు. ఈ గొడవలో తమ్ముడితో కలసి భర్త రమణను దాడి చేసి దారుణంగా చంపింది భార్య రవణమ్మ. డెడ్ బాడీని కారులో తీసుకొచ్చి నంద్యాల జిల్లాలోని నూనెపల్లెలో వాళ్ల ఇంటి దగ్గర పడేసి భార్య రవణమ్మ పరారైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు రమణ ఇంటి వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై నంద్యాల జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.