ఎన్నికలు ఆగడానికి కారణమైన మాధవరెడ్డి ఎవరు?
హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : ఎంతపని చేశావ్ మాధవన్నా.. అంటూ బీసీ సంఘాలు ఓ వైపు, ప్రభుత్వ వర్గాలు మరోవైపు, రాజకీయ పార్టీలు ఇంకో వైపు తలలు పట్టుకునేలా చేసిన వ్యక్తి ఓ సామాన్యుడు, సామాజిక కార్యకర్త.
రాజకీయపరంగా సంక్రమించిన రిజర్వేషన్ల వ్యవస్థ రానురానూ వక్రభాష్యం పలుకుతుందన్న ఆయన ఆందోళన తాజాగా ఇంతటి పరిణామాలకు దారితీసింది. అగ్ర వర్ణాల్లోనూ అనేక మంది పేదలున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలో వారికి కూడా న్యాయం జరగాలన్నది ఆయన బలమైన ఆకాంక్ష.
ఈ క్రమంలోనే రెడ్డి జాగృతి అనే వ్యవస్థను నెలకొల్పి పోరాటం మొదలు పెట్టాడు. ఆయన వేసిన ఒక్క పిటీషన్‌తో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. ఇంతటితో ఆగదని, కులాలకు, మతాలకు అతీతంగా పేద వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లు ఉండేలా పోరాటం కొనసాగిస్తాయని ఆయన స్పష్టం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తూ.. రేవంత్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ని వ్యతిరేకిస్తూ.. బుట్టెంగారి మాధవరెడ్డి హైకోర్టులో ధాఖలు చేసిన పిటీషన్ రాష్ట్రమంతా రాజకీయ రాద్దాంతం సృష్టిస్తోంది.
ప్రభుత్వ వ్యూహానికి దెబ్బ తగిలింది. బీసీ సంఘాలకు షాక్ తగిలేలా చేసింది. ఇదే అంశంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో రాజకీయ పార్టీలకు ఇరకాటంలో పడేసింది. క్షేత్రస్థాయి వరకూ వెళ్లిన ఈసీ కసరత్తుకు బ్రేక్ పడింది. అదే సమయంలో తెలంగాణ రాజకీయాల్లో బుట్టగారి మాధవ రెడ్డి ఈ పేరు ఒక్కసారిగా పెద్ద చర్చకు కారణమైంది. ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికల సమయంలో వ్యవస్థను సవాల్ చేస్తూ ఎన్నికల ప్రక్రియను నిలిపివేయించిన ఘటనతో ఆయన పేరు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఎవరీ మాధవరెడ్డి? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే అంశం తాజా పరిణామాల క్రమంలో అత్యంత ఆసక్తిగా, చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళితే, మాధవ రెడ్డి.. ఆయన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి. తార్నాకలోని విశ్వ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్, అనంతరం రామంతాపూర్ క్రాంతి డిగ్రీ కాలేజీలో డిగ్రీ పట్టా పొందారు.
2006లో తెలంగాణ ఉద్యమం ఉధృతమవుతున్న సమయంలో ఆయన ప్రజా సమస్యల కోసం వీధుల్లోకి వచ్చి పోరాడారు. రాస్తారోకోలు, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె వంటి కీలక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించారు. ఈ పోరాటాల్లో ఆయనపై 56 కేసులు నమోదవ్వగా, ఆరు సార్లు జైలుకూ వెళ్లారు.
అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. తెలంగాణ సాధన తన కర్తవ్యమని నమ్మి చివరి వరకు పోరాడారు. ఉద్యమం తర్వాత కూడా మాధవ రెడ్డి సామాజిక సేవ పట్ల తన అంకితభావాన్ని కొనసాగించారు. 2016లో రెడ్డి జాగృతి సంస్థను స్థాపించి, తెలంగాణ వ్యాప్తంగా రెడ్డి సమాజ అభ్యున్నతికి కృషి చేస్తున్నారు.
విద్య, ఉపాధి, ఆర్థిక స్థితి, సామాజిక న్యాయం వంటి అంశాల్లో సమాన హక్కులు రావాలని ఆయన ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగం అందరినీ సమానంగా చూడాలి.. అప్పుడు అది ప్రజా రాజ్యాంగం అవుతుంది.. లేకపోతే తరగతి రాజ్యాంగంగా మిగిలిపోతుంది అనే ఆయన మాటలు ప్రజల్లో చైతన్యం కలిగించాయి. 2020లో దుబ్బాక ఉపఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రజల హక్కులు కాపాడటమే తన లక్ష్యమని మాధవ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన రెడ్డి జాగృతి ద్వారా విద్యార్థులు, రైతులు, ఉద్యోగార్థుల కోసం పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు, పేద విద్యార్థులకు విదేశీ విద్యా స్కాలర్‌షిప్‌లు, 60 ఏళ్లు నిండిన వృద్ధులకు గౌరవ వేతనం, రైతు మరణాలపై ఎక్స్‌గ్రేషియా లాంటి పథకాలను ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.