భారీ వర్షాల నుండి తేరుకుంటుండగానే….

  • వ‌ణికిపోతున్న ప్ర‌జ‌లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇప్పుడిప్పుడే భారీ వర్షాల బీభత్సం నుంచి తేరుకుంటున్న ప్రజలను ఇప్పుడు చలి తీవ్రత వణికిస్తోంది. మధ్యాహ్నం మాత్రమే వేడిగా ఉంటుండగా, పగలు–రాత్రి వేళల్లో చలి గాలులు వీస్తున్నాయి. సాయంత్రం 5 గంటల నుండి ఉదయం 7–8 గంటల వరకు చలి తీవ్రత అధికంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో చలి గాలులతో ప్రజలు సాయంత్రం ఆరు గంటలు దాటకముందే ఇళ్లకు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరగనుందని వాతావరణశాఖ హెచ్చరించింది.

వాతావరణశాఖ తాజా హెచ్చరికల ప్రకారం ఈ నెల 11 నుండి 19 వరకు రాష్ట్రం అధిక చ‌లి గాలులు ఉండొచ్చు అని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరగనుందని అధికారులు తెలిపారు. నవంబర్‌ 13 నుంచి 17 వ‌ర‌కూ క‌నిష్ఠ ఉష్టోగ్ర‌త‌లు ప‌డిపోయే అవ‌కాశాలు ఉన్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 9 డిగ్రీల సెల్సియస్ కి ప‌డే అవ‌కాశం ఉంద‌ని అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌ సహా ఇతర జిల్లాల్లో ఉదయం ఉష్ణోగ్రతలు 11 నుండి 14 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో, ముఖ్యంగా ఆంధ్రా సరిహద్దు ప్రాంతాల్లో మోస్తరు చలి కొనసాగనుంది. చలి తీవ్రత పెరగనున్న నేపథ్యంలో.. జలుబు, జ్వరం వంటి సీజ‌న‌ల్ వ్యాదులు సోకే అవకాశం ఉంది. అందువల్ల వృద్ధులు, చిన్నపిల్లలు, అలాగే అనారోగ్యంతో ఉన్నవారు చ‌లి నుంచి తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో బయటకు వెళ్లేటప్పుడు వెచ్చని దుస్తులు ధరించడం, వేడి పానీయాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Reply