బృందావన్ కాల్వకు మరమ్మతులు ఎప్పుడో…?

బృందావన్ కాల్వకు మరమ్మతులు ఎప్పుడో…?
- దశాబ్దాలుగా పరిశీలనలకే పరిమితం…
- ప్రతిపాదనలు శూన్యం..!
- వేసవికాలంలోనే పనులు చేపట్టాలని ప్రజల డిమాండ్
మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో ని 1,2,9 వ వార్డులలోని నివాస గృహాల మధ్యలో ఉన్న బృందావన్ కాల్వ కి దశాబ్దకాలంగా ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో కాల్వ కి సంబంధించిన తూములు, సైడ్ వాల్ లు పూర్తి స్థాయిలో దెబ్బతినడంతో పాటు కాల్వలో పూర్తి స్థాయిలో కంప చెట్లు పెరిగిపోయి వర్షాకాలంలో ఈ బృందావన్ కాల్వ నీళ్లు కాస్త సమీప ఇండ్లలోకి వరద నీరు చేరుతున్నాయి.
నీటితో పాటు ప్రమాదకర స్థాయిలో పాములు, తేళ్లు ఇండ్లలోకి చేరడంతో ప్రాణభయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన దుస్థితి నెలకొంది .దీంతో కాల్వ సమీప వాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కాల్వలో సిమెంట్ లైనింగ్ లేకపోవడంతో కాల్వలో సమీప ఇండ్లకు సంబంధించిన డ్రైనేజీ వాటర్ సైతం స్టోరేజి కావడంతో ఇండ్లలోకి దోమలు విపరీతంగా రావడంతో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు.
తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా గాధరి కిశోర్ కుమార్, ప్రస్తుత ఎమ్మెల్యే మందుల సామెల్ లు బృందావన్ కాల్వ ప్రక్షాళన కోసం కృషి చేస్తామని… హామీలు ఇస్తూ కేవలం పరిశీలనకే పరిమితమౌతున్నారే తప్ప… ప్రతిపాదనలు పంపడంలో మాత్రం విఫలమౌతున్నారని మున్సిపల్ ప్రజలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఈ వేసవికాలంలో సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రతిపాదనలు అందించి,సత్వరమే నిధులు మంజూరు చేయించి, పూర్తి స్థాయిలో ఈ వేసవి కాలంలోనే బృందావన్ కాల్వ మరమ్మతు పనులు పూర్తి అయ్యేలా చూడాలని మున్సిపల్ ప్రజలు,మేధావులు, రాజకీయ మేధావులు కోరుతున్నారు.
