అన్ని వసతులు కల్పిస్తాం..తెలంగాణ సీఎం రేవంత్
ఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీ (Delhi) లో జరిగిన 12వ పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా (Public Affairs Forum of India) సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పరిపాలన చేయాలంటే పొలిటికల్ విల్ చాలా అవసరమని అన్నారు. ఈ సమయంలో కేసీఆర్ పై సీఎం రేవంత్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ(Telangana)లో ఒక ట్రంప్ ఉండేవాడని, ఆయనను ప్రజలు పక్కన పడేశారన్నారు. ఇష్టారాజ్యంగా పరిపాలన నడిపించే వాళ్ళు ఎవరైనా ట్రంప్ (Trump) అవుతారని అన్నారు. రాత్రి నిద్రలో ఏదైనా ఆలోచన వస్తే, మరుసటి రోజు ఆర్డర్ ఇవ్వడం చాలా రోజులు నడవదన్నారు. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అమెరికా(America)కే నష్టం కలిగిస్తాయన్నారు. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ సంస్థలతో మాట్లాడి… అమెరికా కాదంటున్న సంస్థలను ఇండియాకి రావాలని కోరుతాం అన్నారు.

తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెడితే అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. హైదరాబాద్ (Hyderabad) పురాతన కట్టడాలు, సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమన్నారు. హైదరాబాద్ 160 కిలోమీటర్లమేర ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road) ఉందని, అంతేకాకుండా రాష్ట్రంలో రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సెమీ అర్బన్, రూరల్ తెలంగాణ పేరిట తెలంగాణ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రతిరోజూ సగటున హైదరాబాద్ మెట్రోలో 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో 15 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.

