Trump | పాక్ – భార‌త్ ల వివాదంలో మేం జోక్యం చేసుకోబోం – తేల్చి చెప్పిన ట్రంప్

వాషింగ్ట‌న్ డిసి – భారత్‌-పాక్‌ మధ్య యుద్ధ మేఘాలు క‌మ్ముకుంటున్న‌ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు అధ్యక్షుడు డొనాల్డ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ విష‌యంలో తాము త‌ల‌దూర్చ‌బోమ‌న్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా రోమ్‌ పర్యటనకు బయలుదేరారు.

ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో భారత్‌-పాకిస్తాన్‌ ఉద్రిక్తతపై ట్రంప్‌ను మీడియా ప్రశ్నించింది. ఈ సందర్బంగా ట్రంప్‌ మాట్లాడుతూ.. భారత్‌ అంటే నాకు ఎంతో గౌరవం. అలాగే పాకిస్తాన్‌ కూడా నాకు చాలా దగ్గర. రెండు దేశాలతో నేను సన్నిహితంగా ఉంటాను. కశ్మీర్‌ విషయంలో భారత్‌, పాక్‌ల మధ్య చాలా ఏళ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. అయితే, ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయి. ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువగా చేసేదేమీ లేదు. ఇక, పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి చెత్త పని. ఉగ్రవాదుల దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విచారకరమని వ్యాఖ్యలు చేశారు.

అంతకుముందు ట్రంప్‌.. కశ్మీర్‌ పహల్గాం ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌కు అమెరికా మద్దతుగా నిలుస్తుంది. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి. ప్రధాని మోదీ, భారత ప్రజలకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పుకొచ్చారు.

Leave a Reply