అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యలను ఎండగడతాం…

- బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ శాసనసభాపక్షం సమావేశం
- శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు
- అసెంబ్లి వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయనున్న బీజేపీ
ఆంధ్రప్రభ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ (BJP) పక్కా వ్యూహంతో సిద్ధమైంది. కృష్ణా నదీ జలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో జాప్యం వంటి కీలక అంశాలను అస్త్రాలుగా చేసుకుని సభలో ప్రభుత్వంపై దాడికి సన్నద్ధమైంది.
ఈ మేరకు ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో జరిగింది.
శీతాకాల అసెంబ్లి సమావేశాల్లో ప్రజాపక్షంగా బలంగా నిలబడి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి స్పష్టమైన సమాధానాలు రాబట్టాలని బీజేపీ శాసనసభాపక్షానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లి అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనపై అసెంబ్లీలో బలమైన స్వరం వినిపించాలన్నారు.
ఈ సమావేశంలో వ్యక్తిగత కారణాలతో పాల్గొనలేని ఎమ్మెల్యేలతో కూడా రాంచందర్‌రావు ఫోన్లో మాట్లాడి సభలో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. ప్రతీ ఎమ్మెల్యేకు సమావేశంలో చర్చించిన అంశాలపై అవగాహన కల్పించి, శాసనసభలో సమన్వయంతో పాల్గొనేలా దిశానిర్దేశం చేశారు.
నదీ జలాలపై ప్రత్యేక దృష్టి..
ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ ప్రత్యేకంగా హాజరుకావడం గమనార్హం. ఆయన సారథ్యంలో నదీ జలాల విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని , ఆ పరిస్థితిని నివారించేందుకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోని అంశంపై విస్తృతంగా చర్చించారు.
కృష్ణా నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఆయన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న సాయాన్ని లెక్కలతో సహా వివరించాలని, అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంపై సభలో దీర్ఘకాలిక చర్చకు పట్టుబట్టాలని బీజేపీ నేతలు తీర్మానించారు.
నెల రోజులు సభ జరపాలి: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
అసెంబ్లీ సమావేశాలను కేవలం మూడు నాలుగు రోజులకే పరిమితం చేయకుండా, కనీసం నెల రోజుల పాటు నిర్వహించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల సమస్యలపై చర్చించే ధైర్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉందా? అని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, ప్రజాధనాన్ని వందల కోట్ల రూపాయల ఖర్చుతో ఫుట్‌బాల్ టోర్నమెంట్లు వంటి వాటికి వృథా చేస్తున్నారని విమర్శించారు. ‘ఫ్యూచర్ సిటీ’ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారని ఆయన మండిపడ్డారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పైడి రాకేష్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, గోలి మధుసూదన్‌రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో అందుబాటులోలేని ఎమ్మెల్యేలు జూమ్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
