రెండేళ్లలో ఎస్ఎల్బిసి టన్నెల్ పూర్తి చేస్తాం…

- బిఆర్ఎస్ నిర్లక్ష్యం వల్ల రూ.4600 కోట్లకు చేయూకున్న ప్రాజెక్ట్ వ్యయం
- డిసెంబర్ 31 లోపు నిర్వాసితులకు పరిహారం
- బొందపెట్టిన బుద్ధి రాని బీఆర్ఎస్ పార్టీ
- బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో 10 కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేదు
- మహబూబ్నగర్, నల్లగొండ ప్రాజెక్టులపై కేసీఆర్ చిన్నచూపు
- కెసిఆర్, హరీష్ రావు వల్లే కృష్ణా నీటి వాటాలో తీరని అన్యాయం
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి/అచ్చంపేట, (ఆంధ్రప్రభ) : ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీతో, రానున్న రెండు సంవత్సరాల్లో రూ.4,600 కోట్ల బడ్జెట్‌తో టన్నెల్‌ను పూర్తిచేసి నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులకు, 30 లక్షల మంది ప్రజలకు, 3 లక్షల ఎకరాలకు త్రాగునీరు, సాగునీరు అందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్రికేయుల సమావేశంలో తెలిపారు.
సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారి పల్లి గ్రామంలో ఎస్.ఎల్.బి.సి. టన్నెల్–1లో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, ఆర్మీ అధికారి పరీక్షిత్ మెహర, చీఫ్ సైంటిస్ట్ ఎన్.జి.ఆర్.ఐ. డైరెక్టర్ ప్రకాష్‌లతో కలిసి అత్యంత కీలకమైన ఎలెబోన్ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వేను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో 1983లో అంకురార్పణ కాపీచబడిన ఈ ప్రాజెక్టును 2004లో అప్పుడు ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీతో, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 42 కిలోమీటర్ల పొడవుతో టన్నెల్–1, టన్నెల్–2 పనులు ప్రారంభించారు. 2014 నాటికి దాదాపు పూర్తి దశకు చేరినా, అనంతరం ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం వివక్షతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని అన్నారు.
పైసా ఖర్చు కాకుండా గ్రావిటీ పద్ధతిలో నల్గొండ జిల్లాకు త్రాగునీరు, సాగునీరు అందించేందుకు రూపొందించిన ఎస్.ఎల్.బి.సి. ప్రాజెక్టు, బీఆర్‌ఎస్ పది సంవత్సరాల పాలనలో రాజకీయ దురుద్దేశం, కమిషన్‌ల కక్కుర్తితో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. ఆ పది సంవత్సరాల్లో 10 కిలోమీటర్లూ ముందుకు పోలేదని విమర్శించారు.
అప్పుడు ప్రాజెక్టు పూర్తిచేసి ఉంటే రూ.2,000 కోట్లతో ముగిసేదే. కానీ కేసీఆర్ వివక్ష వల్ల ఇప్పుడు వ్యయం రూ.4,600 కోట్లకు చేరింది. ఈ పాపం అంతా కేసీఆర్‌దే అని వ్యాఖ్యానించారు. క్రిష్ణా నదిపై కూడా బీఆర్‌ఎస్ పాలనలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదని, అయితే ప్రాజెక్టుల పేరుతో రూ.1.86 లక్షల కోట్లు కాంట్రాక్టర్లకు కేటాయించారని, అందులో రూ.1.05 లక్షల కోట్లు కాళేశ్వరం కోసమే వెచ్చించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్, హరీష్‌రావు కృష్ణా నదీ జలాలపై 299 టీఎంసీలకే సరిపోతుందని సంతకాలు పెట్టడం వల్ల పక్క రాష్ట్రాలు మన నీటిని దోచుకుంటున్నాయి. మన వాటా మనకు దక్కాలంటే ట్రైబ్యునల్ ముందు పోరాటం తప్పదని అన్నారు. తప్పుడు నిర్ణయాలతో, అక్రమాలకు పాల్పడిన బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు బొందపెట్టారని, అయినా వారికి ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. హరీష్‌రావు చిల్లర మాటలు మానుకోవాలని హేతువు పలికారు.
కేసీఆర్ వల్ల పది సంవత్సరాలు ఆగిపోయిన పనుల కారణంగా 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటోందని తెలిపారు. డిసెంబర్ 31 లోపు ముంపు ప్రాంతాలైన మర్లపాడు తండా, కిస్య తండా తదితర భూమి కోల్పోతున్న నిర్వాసితులకు ఆర్ & ఆర్ ప్యాకేజీతో సహా అన్ని రకాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఉత్తంకుమార్ రెడ్డికి ఉన్న ఆర్మీ అనుభవం, నాకు ఉన్న పరిచయాలతో ప్రాజెక్టును పూర్తి చేయడానికి జాతీయ సంస్థల అధికారులతో పాటు ఆర్మీ అధికారులను తెలంగాణ ప్రాంతానికి డిప్యూటేషన్‌గా తీసుకువచ్చి సహకరిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తికాకపోతే నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలకు భారీ నష్టం. ఇప్పుడు కాకపోతే ఈ ప్రాజెక్టు ఇంకెప్పుడూ పూర్తి కాని ప్రమాదం ఉంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా తొలగించుకుని ప్రాజెక్టును పూర్తి చేస్తామని దీమా వ్యక్తం చేశారు.
