జన్నారం, మార్చి 29 (ఆంధ్రప్రభ ): ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో క్షేత్రస్థాయిలో అవినీతి, అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కార్యదర్శులదేనని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశం హాలులో శనివారం మండల స్థాయి పంచాయతీ కార్యదర్శులకు సమీక్ష సమావేశం ఎమ్మెల్యే నిర్వహించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇల్లు అర్హులకు మాత్రమే ఇవ్వాలన్నారు. అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే కార్యదర్శులపై చర్య తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. తమ నియోజకవర్గంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే ధ్యేయమన్నారు. తమ నియోజకవర్గంలోని ప్రతి వాడల్లో సీసీరోడ్లు నిర్మిస్తామని, ఇండ్లులేని చోట సీసీరోడ్లు వేస్తే కార్యదర్శులపై చర్యలు తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని, తాగునీటి సమస్య ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని, ఎన్ని డబ్బులైనా ఖర్చు చేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. పొనకల్ మేజర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇన్చార్జి ప్రభాకర్ ఆధ్వర్యంలో కుట్టుమిషన్లను ఆయన చేతుల మీదుగా అందజేశారు .ఈకార్యక్రమంలో పంచాయతీరాజ్ డీఈ సుబ్బారెడ్డి, తహసీల్దార్ సి.రాజమనోహర్ రెడ్డి, ఎంపీడీవో ఎండీ హుమర్ షరీఫ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, ఎంపీఓ జలంధర్, పంచాయతి కార్యదర్శులు ఎల్.శ్రీనివాస్, ఆర్.రాహుల్, చంద్రమౌళి, సరిత, కళ్యాణి, కరుణ, రమేష్, సంతోష్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.