Waqf Bill: నేడు లోక్ సభలో వక్ఫ్ సవరణ బిల్లు

న్యూ ఢిల్లీ – బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ”వక్ఫ్ సవరణ బిల్లు-2025”ని పార్లమెంట్‌లో నేడు ప్రవేశపెట్టబోతోంది.

ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బిల్లుపై చర్చించనున్నారు. రేపు రాజ్యసభలో బిల్లుపై చర్చ కొనసాగుతుంది. ప్రతీ సభలో చర్చించడానికి 8 గంటలు కేటాయించారు.తొలిసారిగా 1954లో ”వక్ఫ్ చట్టాన్ని” పార్లమెంట్ ఆమోదించింది. ఆ తర్వాత ఈ చట్టాన్ని రద్దు చేసి, వక్ఫ్ బోర్డుకు మరిన్ని అధికారాలు ఇస్తూ 1995లో కొత్త వక్ఫ్ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఏ ఆస్తినైనా ”వక్ఫ్ ఆస్తులు”గా ప్రకటించే అపరిమిత అధికారాలను వక్ఫ్ బోర్డులకు కట్టబెడుతూ 2013లో మరోసారి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది.

ప్రస్తుతం తీసుకువస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు 2025ని “యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ , ఎంపవర్ మెంట్, ఎఫీసియన్సీ, అండ్ డెవలప్మెంట్ ( ఉమీద్) బిల్లు”గా పిలుస్తారు. ప్రస్తుతం దేశం మొత్తం 30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 9.4 లక్షల ఎకరాలు ఉన్నాయి.

డిజిటలైజేషన్, సమర్థవంతంగా జమా ఖర్చుల నిర్వహణ, పారదర్శకతను పెంపొందించడం, అక్రమంగా ఆక్రమించిన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు న్యాయ, చట్టపరమైన వ్యవస్థలను రూపొందించడం లాంటి సంస్కరణలను ఈ చట్టంలో ప్రవేశపెడుతున్నారు. ఈ బిల్లును గతేడాది వర్షాలకు సమావేశాలకు ముందు ఈ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చారు, అయితే విపక్షాలు అభ్యంతరం తెలపడంతో దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపించింది. జేపీసీ 14 సవరణలను ఆమోదించింది. విపక్షాలు ప్రతిపాదించిన 44 సవరణలు తిరస్కరించింది.

.అయితే, ముస్లింయేతరులను వక్ఫ్ బోర్డులో సభ్యులుగా చేర్చడాన్ని తప్పనిసరి చేయడం ద్వారా సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డుల కూర్పును మార్చాలనే ప్రతిపాదన వివాదాస్పదమైంది. ఇది స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని విమర్శిస్తున్నారు. ఇన్నాళ్లు ఏదైనా ఒక ఆస్తి వక్ఫ్ దే అని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసేది, దీని వల్ల చాలా ప్రాంతాల్లో వివాదాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు కొత్త చట్టం ద్వారా యాజమాన్య హక్కులను రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారి నిర్ణయిస్తారు.

బిల్లు ప్రకారం, జిల్లా కలెక్టర్లకు ఈ పాత్ర ఇవ్వబడుతుంది. చెప్పాలంటే, వివాదాల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *