visible Police | ప్రజా భద్రతే లక్ష్యం…

విజబుల్ పోలీసింగ్‌తో ప్రజలకు భరోసా
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్
visible Police | దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్రజా భద్రతను ప్రధాన లక్ష్యంగా తీసుకొని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి, విజిబుల్ పోలీసింగ్‌తో ప్రజలకు తక్షణ స్పందన ఇచ్చి భరోసా కల్పించాలని రామగుండం పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంచిర్యాల జోన్‌కు చెందిన దండేపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆయన శనివారం పరిశీలించారు.
పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు అధికారులు పూలమొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ సిబ్బందితో కమిషనర్ మాట్లాడి వారి విధులు, పనితీరు, ఎదురవుతున్న సమస్యలను వివరణాత్మకంగా తెలుసుకున్నారు. స్టేషన్ రిసెప్షన్‌తో పాటు అనుబంధ విభాగాల పనితీరును పరిశీలించారు.
వార్షిక తనిఖీల్లో భాగంగా పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, దర్యాప్తులో ఉన్న కేసులపై కమిషనర్ క్షుణ్ణంగా సమీక్ష నిర్వహించి సంబంధిత అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. స్టేషన్ పరిధిలో జరిగే నేరాలు, సమస్యలు, గ్రామాల పరిస్థితులు, ప్రజల జీవన విధానం వంటి అంశాలపై కూడా సమాచారం తీసుకున్నారు. అలాగే రౌడీ షీటర్లు, అనుమానితులు, కేడీలు, డిసీలు, మిస్సింగ్ కేసులు, ప్రాపర్టీ నేరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.
పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ… “విజిబుల్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలి. పెట్రోలింగ్‌ను క్రమం తప్పకుండా నిర్వహించి గ్రామాల్లో ప్రజలతో మమేకం కావాలి. ప్రజల సమస్యలపై మర్యాదపూర్వకంగా స్పందించడం ప్రతి పోలీస్ విధి. పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంపొందేలా పనిచేయాలి” అని పేర్కొన్నారు.
ప్రధాన రహదారులు, గ్రామాల్లో సీసీ కెమేరాల ఏర్పాటు, వాటి పనితీరు వంటి అంశాలను ప్రజలకు వివరించి, వాటి అమలు కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు పటిష్టమైన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపీఎస్, ఏసీపీ ప్రకాష్, లక్షేట్టిపేట్ సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్ఐ తైసీనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
