విశాఖలోని అక్కయ్యపాలెంలో ఘటన
బాలికకు పెళ్లి సంబంధాలు చూస్తున్న కుటుంబం
ఇంట్లోకి చొరబడి తల్లి, కుమార్తెపై యువకుడి దాడి
బాధితుల ఫిర్యాదుతో నిందితుడి అరెస్టు
విశాఖపట్నం , ఆంధ్రప్రభ : విశాఖపట్నంలో ప్రేమోన్మది రెచ్చిపోయాడు. మధురవాడలో జరిగిన దాడి ఘటన మరువక ముందే గురువారం మరో ఘటన చోటుచేసుకుంది. దీంతో విశాఖ నగరం ఉలిక్కిపడింది.. తాజా ఘటన ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గాజువాకకు చెందిన యువకుడు అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన బాలికను ఏడాది నుంచి ప్రేమిస్తున్నాడు.. వీరిద్దరూ ఇంటర్ చదువుతున్నారు.. ఈ విషయం బాలిక ఇంట్లో తెలియడంతో వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువకుడు బాలిక ఇంట్లోకి చొరబడి తల్లి, కూతురుపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేశాడు.. ఈ ఘటనలో ఇద్దరూ గాయపడ్డారు.. యువకుడి దాడి నుంచి కాపాడాలని కేకలు వేయడంతో అక్కడి నుంచి యువకుడు పారిపోయాడు. బాధితులను స్థానికులు ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని కత్తి స్వాధీనం చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు.