Vigilance case | విజిలెన్స్ కేసు పరిష్కారం కోసం..

Vigilance case | విజిలెన్స్ కేసు పరిష్కారం కోసం..

వారసుల నిరసన
ఓసిపి -5 ప్రాజెక్టు వద్ద ప్లే కార్డులతో ఆందోళన
నిరసనలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నేతలు


Vigilance case | గోదావరిఖని, ఆంధ్రప్రభ : సింగరేణి (Singareni) బొగ్గు పరిశ్రమలు మారుపేర్ల కార్మికుల వారసులు ఆందోళనకు దిగారు. బొగ్గు పరిశ్రమలోని గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ‌ ఉదయం రామగుండం రీజియన్ లోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు -5 వద్ద మారుపేర్ల వారసులు నిరసన చేపట్టారు.

పరిశ్రమలో సింగరేణి కోల్ బెల్ట్ వ్యాప్తంగా మారుపేర్ల విజిలెన్స్ కేసుల (Vigilance case) పరిష్కారం కోసం గొంతెత్తి నినదించారు. దశాబ్ద కాలానికి పైగా మారుపేర్ల కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టారు. సింగరేణిలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మారు పేర్ల సమస్యకు సంబంధించి విజిలెన్స్ కేసుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్జీ-1 ఏరియా ఓసిపి-5 ఓపెన్ కాస్ట్ వద్ద కార్మికులు, మారుపేర్ల కార్మికుల వారసులు, నిరుద్యోగ యువత ప్లే కార్డ్స్ తో వినూత్న నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ (Singareni Collieries) వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కేంద్ర ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లయ్య గౌడ్ మాట్లాడుతూ… మారుపేర్ల కార్మికుల సమస్యను జాప్యం చేయకుండా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మారుపేర్ల కార్మికుల వారసుల భవిష్యత్తును సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని పరిష్కారం చేయాలన్నారు. మారుపేరులకు సంబంధించి విజిలెన్స్ కేసు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో వందలాది మంది వారసులకు ఉపాధి లభించక కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోందన్నారు. మారుపేర్ల కార్మికుల వారసులకు సంబంధించి సమస్యలను పరిష్కరించడంలో ఏఐటియుసి ముందుంటుందని చెప్పారు. నిరసన కార్యక్రమాల్లో నాయకులు మండ రమేష్ గౌడ్, డిష్ బాబు, రామీల సందీప్, సదానందం, దనాడ రాజు, హరీష్ యాదవ్, ఓం ప్రకాష్, సత్యం , ఆవుల రవి, పలువురు కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply