చెన్నారావుపేట, మార్చి6(ఆంధ్రప్రభ) : చెన్నారావుపేట మండలంలో విషాదం చోటు చేసుకుంది. మండలంలోని కోనాపురం గ్రామ శివారులో కూలీలతో వెళ్తున్న ఓ ట్రాలీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలవగా, మరికొందరికి కాళ్లు, చేతులు విరగడం, పలు చోట్ల గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే జీడిగడ్డ తండా గ్రామానికి చెందిన సుమారు 40మంది కూలీలు నర్సంపేట మండలంలోని ఇప్పల్ తండాకు మిర్చి ఏరడానికి టిజీ 24టి 1472 మహీంద్రా ట్రాలీలో ఇవాళ ఉదయం తండా నుండి వెళ్తున్న క్రమంలో కోనాపురం గ్రామ శివారులో ఒక్కసారిగా అదుపుతప్పడంతో ట్రాలీ బోల్తా పడింది.
దీంతో అందులో ఉన్న కూలీలకు గాయలయ్యాయి. వారిని 108అంబులెన్సులో చికిత్స నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా బానోతు సుఖ్య మరణించగా, పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. మరికొందరు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్ఐ రాజేష్ రెడ్డి సమాచారం అందగానే సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. కాగా అధిక లోడ్ తో పాటు అతి వేగంతో అజాగ్రత్తగా డ్రైవర్ వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని తండా వాసులు ఆరోపిస్తున్నారు.
మృతుడి కుటుంబానికి రూ.25లక్షలు ఎక్స్ గ్రేషియా అందించాలి – మాజీ ఎమ్మెల్యే పెద్ది
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. మరణించిన సుఖ్య కుటుంబానికి ప్రభుత్వం రూ. 25లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని, గాయాలైన వారికి ప్రభుత్వమే కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించి, వారి కుటుంబాలకు రూ.10లక్షలు ఆర్థిక సహాయం అందించాలని పెద్ది డిమాండ్ చేశారు. ఇప్పటికైనా నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై దృష్టి పెట్టి అన్ని రకాల వైద్య సేవలు ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
