Tiryani | దొంగ ఓట్ల కలకలం…

తిర్యాణి, ఆంధ్రప్రభ : మండలంలో దొంగ ఓట్లు వేయించుకుని అధికార పార్టీ గ్రామపంచాయతీ పీఠాలను దక్కించుకోవాలని ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు హనుమండ్ల జగదీష్ ఆరోపించారు. దొంగ ఓట్ల వ్యవహారంపై ఆయన తన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

ఈ సందర్భంగా గెలుపొందిన సర్పంచులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తమపై నమ్మకం ఉంచి 12 గ్రామపంచాయతీల్లో ఓట్లు వేసి గెలిపించిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే అధికార పార్టీ దొంగ ఓట్లు వేయించుకుని అన్యాయంగా లాభం పొందాలని చూస్తోందని మండిపడ్డారు.

గంభీరావుపేట గ్రామానికి చెందిన కంపెల శ్రీనివాస్ అనే వ్యక్తి తిర్యాణి గ్రామపంచాయతీ 8వ వార్డులో క్రమ సంఖ్య 1323 ద్వారా ఓటు హక్కు వినియోగించుకుని, మళ్లీ గంభీరావుపేట గ్రామపంచాయతీ 3వ వార్డులో క్రమ సంఖ్య 354 ద్వారా మరోసారి ఓటు వేసినట్లు ఆరోపించారు.

అదే విధంగా అతని భార్య లావణ్య కూడా తిర్యాణి గ్రామపంచాయతీ 8వ వార్డులో క్రమ సంఖ్య 1324 ద్వారా ఓటు వేసి, మళ్లీ గంభీరావుపేట గ్రామపంచాయతీ 3వ వార్డులో క్రమ సంఖ్య 355 ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఒకే మండలంలో రెండు గ్రామపంచాయతీల్లో ఓటు వేయడం తీవ్రమైన తప్పిదమని ఆయన పేర్కొన్నారు.

అధికార దాహంతో అధికార పార్టీ ఈ విధంగా దొంగ ఓట్లు వేయించుకుని గెలవాలని చూస్తోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఆర్డీవోకు, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఈ అంశంపై హైకోర్టులో కేసు దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. అధికార పార్టీ ఇంకా ఎంతమంది పేర్లతో దొంగ ఓట్లు వేయించిందో తమ కార్యకర్తలు పరిశీలిస్తున్నారని చెప్పారు. కొన్ని చోట్ల చనిపోయిన వారి పేర్లపై కూడా ఓటు హక్కు వినియోగించారని ఆరోపించారు.

దొంగ ఓట్లకు సంబంధించిన పూర్తి వివరాలు, సాంకేతిక ఆధారాలు తమ వద్ద సిద్ధంగా ఉన్నాయని, వీటిని న్యాయస్థానంలో సమర్పిస్తామని తెలిపారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం గెలుపొందిన 12 గ్రామపంచాయతీ సర్పంచులు, నాయకులు, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

దొంగ ఓట్లపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా : శివప్రసాద్

తిర్యాణి మండలంలో దొంగ ఓట్ల వ్యవహారంతో కలకలం రేగిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శివప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓట్లు వేసి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారని ఆయన ఆరోపించారు. ఇంకా ఎంతమంది చనిపోయిన వారి పేర్లపై ఓట్లు వేసారో తెలియని పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply