Union బడ్జెట్ లో తెలంగాణకు మరోసారి అన్యాయం – రేవంత్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్ – కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మేం ఏం అడిగాం… మీరు ఇచ్చింది ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.. మరోసారి కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు..కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశమయ్యారు..ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. రాష్ట్రంలో అనుసరించాల్సిన ఆర్థికపరమైన విధానాలు, పథకాల ప్రాధాన్యతపై వారు చర్చించారు.
మేం అడిగింది ఒక్కటైనా ఇచ్చారా – మంత్రి దుద్దిళ్ల ..
దేశ జీడీపీలో ఎక్కువ భాగం తెలంగాణదే అయినప్పటికీ, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన నిధుల వాటా తప్పనిసరిగా రావాలని ఆయన అన్నారు. పక్క రాష్ట్రానికి, ఇతర రాష్ట్రాలకు నిధులు ఎందుకు ఇచ్చారనే ఆలోచన తెలంగాణ ప్రజల్లో కలగకుండా ఉండాలంటే, ఇక్కడి బీజేపీ నాయకులు నిధులు తీసుకురావాలని ఆయన అన్నారు.
ఇంత అన్యాయమా … మంత్రి కొండా సురేఖ
2025-26 కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన చెందారు. కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు. దేశంలోని చిన్న రాష్ట్రమైన తెలంగాణకు నిర్మలా సీతారామన్ తగినన్ని నిధులు కేటాయించకపోవడం బాధాకరమని, ఈ విషయంలో మాట్లాడటానికి తనకు మాటలు కూడా రావడం లేదని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల అభ్యర్థనలను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందని విమర్శించారు.
తెలుగింటి కోడలు అయినా…
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని, రాజకీయంగా రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌పై ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయించింది శూన్యమన్నారు. తెలుగు కోడలు అయి ఉండి కూడా నిర్మలా సీతారామన్ తెలంగాణపై అభిమానం చూపించలేకపోయారని విమర్శించారు. త్వరలో బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఆ రాష్ట్రంలో రాజకీయ లబ్ధి కోసం భారీగా కేటాయింపులు చేశారని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ నేతలు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు కేంద్రమంత్రులను, ప్రధానమంత్రిని కలిసి తెలంగాణకు రావాల్సిన అనేక అంశాలపై విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన అన్నారు. తెలంగాణకు అవసరమైన అంశాల్లో కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.