Union Ministers | వనదేవతలను దర్శించుకున్న కేంద్రమంత్రులు..

Union Ministers | మేడారం (మంగపేట), ఆంధ్రప్రభ : మేడారంలోని వనదేవతలైన సమ్మక్క సారలమ్మలను కేంద్రమంత్రులు జి.కిషన్ రెడ్డి, జువాల్ ఓరం గురువారం దర్శించుకున్నారు. మేడారంకు విచ్చేసిన కేంద్రమంత్రులకు రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ దివాకర్, పూజారులు, అధికారులు ఘనస్వాగతం పలికారు.

వనదేవతలను దర్శించుకున్న కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి 75కిలోలు, జువాల్ ఓరం 86 కిలోలు తులాభారం వేసుకొని అమ్మవార్లకు తమ ఎత్తు బంగారం మొక్కు చెల్లించుకున్నారు. మేడారం విచ్చేసిన కేంద్రమంత్రులకు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ లు మెమోంటోలు అందజేశారు.
మేడారం అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

మేడారం జాతర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించిందని, జాతర అభివృద్ధికి కేంద్రప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవాళ మేడారంలో కేంద్రమంత్రి జువాల్ ఓరంతో కలిసి వనదేవతలను దర్శించుకున్న అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రామప్పకు మొట్టమొదటి యునెస్కో గుర్తింపు వచ్చేలా మోడీ ప్రభుత్వం కృషి చేసిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మేడారంలో నూతన కట్టడాలు చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రప్రభుత్వం తరపున అభినందిస్తున్నామన్నారు. ఈప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ వస్తే గిరిజన యువత అభివృద్ధికి మరింత దోహదపడుతుందన్నారు.
