ఏడాది పర్వాలకు ఆది పండుగ ఉగాది

ఏడాది పండుగ, ఉగాది పండుగ అనే దేశ్య నామాలతో వ్యవహరింపబడే సంవత్సరాది పర్వము, ఏటా రానున్న ఎన్నతగిన ఏభై పైచిలుకు పండుగలలో మొదటిది. తెలుగువారు తమ సంవ త్సరాదిని చాంద్రమాన గణనాధారంగా చైత్ర శుక్ల ప్రతిపదతో ప్రారంభించడం సనాతన ఆచారం. చైత్ర శుక్ల పాడ్యమి సంవత్సరాది అని బ్రహ్మపురాణం కంరోక్తిగా చెపుతున్నది. అలాగే ఈదినం నుండి సృష్టి ప్రారంభింపబడి, ఆయా దేవతలకు సంబంధిత పనులను బ్రహ్మ అప్పగించినట్లు పురాణ కథనం. శాలివాహన శకానికి మొదటి దినం చైత్ర శుక్లపక్ష పాడ్యమిగా భావించబడు తున్నది. వనవాసానంతరం శ్రీరాముడు సీతా, లక్ష్మణ సహ తంగా అయోధ్యకు ఈనాడే తిరుగు ప్రయాణమై నట్లు పురాణ లిఖితం. వసంత కాలారంభ దినాలలో చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది పర్వం జరిపే ఆచారం ఆర్యుల్లో అతి ప్రాచీన కాలం నుండి ఉన్నది. పార్సీలు ఉగాదిని ”నౌరోజ్‌” అంటారు. నౌరోజ్‌ అనగా కొత్తదినం. ఉగాది పర్వా చరణ విధానాలను నూతన సంవత్సర కీర్తనాద్యా రంభం, ప్రతి గృహ ధ్వజారోహణం, నింబ వ్రతాశనం, సంవత్సరాది శ్రవణం, నవరాత్రి ఆరంభమని ధర్మసింధువు స్పష్టం చేస్తున్నది. ప్రతిగహ ధ్వజారోహణం, అబ్దాది తైలాభ్యంగం, నవవస్త్రాభరణ ధారణం, ఛత్రచామరాది స్వీకారం, ఉమామహేశ్వర పూజ, దమనేన బ్రహ్మపూజనం, సర్వాపచ్ఛాంతికర మహాశాంతి, నింబ కుసుమ భక్షణం, పంచాంగ పూజ, శ్రవణం, ప్రపాదాన ప్రారంభం, రాజదర్శనం వాసంత నవరాత్రి ప్రారంభం…పది విధాయక కృత్యాలుగా చెప్పబడినాయి.

వసంత నవరాత్రుల ప్రారంభం


చైత్ర వైశాఖమాసాలు వసంత రుతువుకాగా, చైత్రమాస తొలిరోజు ఉగాదితో వసంతరుతు ఆరంభం కాగలదు. చైత్రానికి మధుమాసమని, వసంతమాసమని పేరు. ”మధుశ్చ మాధవశ్చ వాసంతి కావృత్‌” అనే యజుర్వేద వాక్యాన్ని బట్టి వేదకాలంలో చైత్రానికి మధుమాసమని పేరున్నట్లు తెలుస్తున్నది. రుతురాజైన వసంతునికి స్వాగతోప చారాలు చేయడానికి తొమ్మిది రోజులను నిర్దేశిం చారు. ఉగాదినాడు కలశ స్థాపన చేసి, నవరాత్ర పూజ చేస్తే అపమృత్యు భయముండదని ధర్మ సింధు వివరిస్తున్నది.
వాత్సాయన కామ సూత్రాలలో ఈ ఉత్సవం ”సువ సంతక”మని, ”మదనోత్సవ”మని పేర్కొనబడింది. రుతురాజైన వసంతుని పూజిస్తే కాలాత్మకుడైన పరమ శివుడు ప్రసన్నుడు కాగలడని భావన. వసం తోత్సవాలు తెలుగు నేలపై గొప్పగా జరిగేవి. ఉత్సవ సందర్భంగా రాజ దర్బారుల్లో ప్రతిదినం నత్యాలు, నాట్యాలు పాట కచ్చేరీలు, పండిత గోష్టులు, శాస్త్ర విచారణలు, నాటక ప్రదర్శనలు జరిగేవి. సంగీతం ప్రధానంగా ఉండేది. ఆకాలాన ఉప యుక్తమైన వసంత రాగమును మేళకర్తలు ప్రత్యేకంగా కూర్చారు. రెడ్డిరాజుల, విజయనగర రాజుల కాలంలో ఉద్యానవనాల్లో మామిడి చెట్టుకింద మంటపం, దానిపై కలశం నెలకొల్పి పూజాపీఠంపై వసంతుని, రతీ మన్మధులను, లక్ష్మీ నారాయణులను, గౌరీ శంకరులను, శచీ పురంధరులను నెల కొల్పి, మంగళ వాద్యాల, వారాంగనల నత్యాలు పన్నీరు, వసంతం చల్లుకోవడం, విద్యా వినోదాలు, క్రీడా ప్రదర్శనలు జరిగేవి. ప్రభువు #హయారూఢుడై ఊరేగి వచ్చి, ఉద్యానవనంలో మంటపం వద్ద దేవతలను పూజించేవాడు. మంగళ వాద్యాలు, వారాంగనల నత్యాలు, పన్నీరు, వసంతం చల్లుకోవడాలు, విద్యా వినోదాలు, వినోద క్రీడలు జరిగేవి.

ఏరువాక ప్రారంభం

ఉగాదినాడు కొన్ని ప్రాంతాలలో ఏరువాక సాగడం ఆచారం. ఎద్దులను కట్టి దున్నుటకు సిద్ధపరిచిన నాగలిని ”ఏరువాక” అంటారు. రైతులు ఉగాది నాడు తలంటి పోసుకుని, బొట్టు పెట్టుకుని, కొత్తబట్టలు వేసుకుని, నాగలికి పాత తాళ్ళు తీసి, పసుపురాచిన కొత్తవి కట్టి, నాగలికి, కాడికి రావి మండలు కట్టి, ఎడ్లకు పసుపురాసి, కుంకుమ పెట్టి పూజించి, కొబ్బరికాయ కొట్టడం సాంప్రదాయాచరణ. ఉగాది నాడు కారణాంతరాల వల్ల ఏరువాక సాగకపోతే మంచిరోజుతో ప్రారంభించ బడాలి. ఏరువాక సాగ నిదే కొత్త ఏడు ఎడ్లచేత వ్యవసాయ పనులు చేయించరు. తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో ఈనాటి సాయంత్రం ఊరిలోని బండ్లను అలంకరించి మంచి ఎడ్లను పూన్చి కొంతదూరం ఊరేగిస్తారు. చైత్ర శుద్ధ పాడ్యమినాడు విద్యా, పౌరుష, ప్రతిపత్‌ తిలక, ధనావ్యాప్తి, సర్వాప్తి, చతుర్యాగ, చతుర్మూర్తి దేవమూర్తి, నదీ, లోక, శైల, సముద్ర, ద్వీప, సప్త మూర్తి, సప్తసాగర మున్నగు ప్రతాలను అచరించా లని చతుర్వర్ణ చింతామణిలో పేర్కొనబడింది.

ఉగాది పచ్చడి

”యద్వర్షాదా నింబసుమం, శర్కరావ్లు ఘతై ర్యుతమ్‌, భక్షితం పూర్వయామేస్యా, త్తద్వర్షం సౌఖ్యదాయకమ్‌”. అని పెద్దల ఉవాచ. ఉగాది నాడు ఆ ఏటి వేపపువ్వు, చక్కెర (లేదా కొత్తబెల్లం), చింత పండు, నెయ్యి కలిపి చేసే పచ్చడిని మొదటి జాము నందే తింటే ఆ వత్సరమంతా సుఖంగా జరుగు తుందని విశ్వాసం. వేపపువ్వు ప్రధాన ద్రవ్యంగా చేసే పచ్చడి గొప్ప ఔషధంగా భావించ బడుతుంది.

  • రామకిష్టయ్య సంగనభట్ల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *