రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి..

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి..

మంత్రి డోల, కలెక్టర్, మాగుంట వెల్లడి

ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు : దైవానుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఆకాంక్షించారు. శ్రీపరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఒంగోలులోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాలులో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మంత్రితోపాటు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు దంపతులు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్.విజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ ముప్పవరపు సుచిత్ర, ఇతర ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

మంగళ వాయిద్యాలతో అధికారులు వీరికి స్వాగతం పలుకగా, ప్రముఖ వేద పండితుడు దక్షిణామూర్తి ఈ సంవత్సర పంచాంగాన్ని వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కీలకమైన వెలుగొండ ప్రాజెక్టు, రామాయపట్నం పోర్టు, సంగమేశ్వరం, కొరిసపాడు, ఇతర ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా దైవాశీసులతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. అన్ని రంగాలలోనూ జిల్లా ప్రకాశించాలని మంత్రి అభిలాషించారు.


కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను అధికారి యంత్రాంగం త్వరగా పూర్తి చేయటం ద్వారా ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి వివిధ ప్రాజెక్టులను తీసుకువచ్చేలా ముఖ్యమంత్రి పడుతున్న తపన సహకారం కావాలని, ప్రకాశం, మార్కాపురం జిల్లాలు సంపన్నం కావాలని ఆకాంక్షించారు.


సంతనూతలపాడు ఎమ్మెల్యే, ఒంగోలు మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకటరావు మాట్లాడుతూ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలకు అన్ని విధాలుగా మేలు కలగాలని ఆకాంక్ష వ్యర్థం చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను, ప్రజలను దక్షిణామూర్తి ఆశీర్వదించారు. అనంతరం ఆయనతోపాటు మరో నలుగురు అర్చక స్వాములను అతిథులు సత్కరించారు. వట్యం నాగేశ్వర విశ్వనాథ శర్మ, నాదెండ్ల నాగేశ్వరరావు, నడింపల్లి లక్ష్మీనారాయణ, పరాంకుశం శ్రీనివాసచార్యులకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున ఒక్కొక్కరికి రూ.10,116 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకర్షించాయి.


ఈ వేడుకల్లో డిఆర్ఓ బి.చిన ఓబులేసు, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ పానకాలరావు, పలువురు జిల్లా స్థాయి అధికారులు, కవులు, రచయితలు పాల్గొన్నారు.

Leave a Reply