పోలీసుల అదుపులో ఇరువురు కొత్తకోట యువకులు
- అటవీ ప్రాంతంలో భారీగా ఆయుధాలు?
శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా(Sri Sathya Sai Distt) పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలం పరిధిలోని కొత్తకోట గ్రామంలో నాటు తుపాకీ లభ్యమైంది. గ్రామానికి చెందిన ఇరువురు యువకుల నుంచి నాటు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఇదే సందర్భంలో కొత్తకోట గ్రామ అటవీ ప్రాంతంలో మరిన్ని ఆయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై అదుపులోకి తీసుకున్న యువకుల నుంచి సమాచారం రాబట్టేందుకు పోలీసులు(Police) ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. గతంలో బుక్కపట్నం మండల పరిధిలోని కొత్తకోట, నార్సింపల్లి ప్రాంతంలో మావోయిస్టు కదిలికలు, ఫ్యాక్షన్ సంఘటనలు అనేకం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా తాజాగా గ్రామంలో రెండు వర్గాల వారు పరస్పరం దాడులకు పాల్పడ్డారు.
ఈ నేపథ్యంలో ఇరువురు యువకుల వద్ద నాటు తుపాకీ స్వాధీనం చేసుకోవడం కొత్తకోట గ్రామంలో కలకలం రేపుతోంది. అంతేకాకుండా అడవుల్లో(Forests) భారీగా ఆయుధాలు ఉన్నాయనే ప్రచారం మరింత సంచలనం కలిగిస్తోంది. ఈ విషయంపై స్థానిక పోలీసులు తమకు ఎలాంటి సమాచారం లేదని అంటుండగా జిల్లా స్థాయిలో ఇందుకు సంబంధించి విచారణ సాగుతున్నట్లు సమాచారం.