ఇద్దరు మహిళలు మృతి
నిర్మల్ ప్రతినిధి, అక్టోబర్ 5 (ఆంధ్రప్రభ): నిర్మల్ పట్టణంలోని బంగల్ పేట్ లో బతుకమ్మ సంబరాల్లో అపశృతి చోటుచేసుకుంది. డీజే సౌండ్ తో మహిళ గుండెపోటుతో మృతి చెందింది. శనివారం రాత్రి బంగల్ పేట్ కు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి బిట్లింగు గణేష్ సతీమణి భాగ్య( 56 )బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. డీజే సౌండ్ ఎక్కువగా పెట్టడంతో ఆమెకు గుండెపోటు వచ్చింది. కుప్పకూలిన ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన నిర్మల్ పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మొదట బతుకమ్మ వేడుకల్లో కోలాలు వేస్తున్న తరుణంలో డిజె సౌండ్ తట్టుకోలేక ఆమెకు విరోచనాలు కావడంతో ఇంటికి తీసుకెళ్లారు. అక్కడి నుండి ఆస్పత్రికి తరలించారు.
వానలపాడులో నవవధువు మృతి
భైంసా మండలంలోని వానలపాడు గ్రామానికి చెందిన రిషిత శనివారం రాత్రి బతుకమ్మ వేడుకల్లో ఆనందంగా గడిపారు. అయితే రాత్రి 8 గంటల సమయంలో తీవ్రమైన తలనొప్పి రావడంతో ఇంటికి వెళ్ళిపోయింది. తలనొప్పి మరింత తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే బైంసా పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సలు తీసుకుంటూ మృతి చెందారు. దీంతో వానల్ పాడు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలు రిషితకు నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది.