ఆంధ్రప్రభ, వెల్దుర్తి, కర్నూలు జిల్లా : కర్నూలు జిల్లా వెల్దుర్తి పట్టణంలోని 14వ వార్డుకి చెందిన మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు షేక్ ఉజ్మ (35) బుధవారం ఇంటిలో హత్యకు గురైంది. మృతురాలికి భర్త మస్తాన్, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
భర్త బ్రతుకుతెరువుకై ఇతర ప్రాంతానికి వెళ్ళినట్లు తెలిపారు. పాఠశాలకు వెళ్లిన కుమారుడు సాయంత్రం తిరిగి వచ్చి ఇంటిదగ్గర చూడగా తాళం వేసి ఉండడంతో చాలాసేపు వేచిచూసి అక్కతో కలిసి తాళం పగల కొట్టారు. ఇంటిలోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులలో పడి ఉన్న తల్లిని చూసి భయంతో కేకలు వేయడంతో స్థానికులు వచ్చిచూసి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెల్దుర్తి సీఐ మధుసూదన్ ఎస్ఐ అశోక్ ట్రైన్ ఎస్సై శ్రీవిద్య వారి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరిన్ని వివరాల సేకరణ కోసం క్యూస్ టీం ను రప్పిస్తున్నట్లు తెలిపారు.