డా॥ నీలం సంజీవరెడ్డి వర్ధంతి సందర్భంగా హృదయసుమార్చనలు
(19 మే, 1913 – 1 జూన్1996)
ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం జిల్లాలో ‘ఇల్లూరు’ అనే గ్రామంలో 1913 మే 19వ తేదీన ఒక రైతు కుటుంబంలో జన్మించారు శ్రీ నీలం. సంజీవరెడ్డిగారి పూర్వీకులు కాకతీయ విజయనగర సామ్రాజ్యంలో సైన్యాధిపతులుగా ఉండేవారు. శ్రీ సంజీవరెడ్డి తండ్రి చిన్నపరెడ్డిగారు ఆ గ్రామానికి పెద్దదిక్కుగా, నాయకునిగా వ్యవహరించేవారు. ఆ గ్రామానికే సంబంధించిన వ్యక్తి, స్వాతంత్య్రోద్యమంలో ప్రముఖపాత్రను వహిస్తాడని గాని, దేశాధినేత అవుతాడని గానీ ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఊహించి ఉండలేదు కూడా.
చిన్నపరెడ్డిగారు నాన్నగారి పేరును కుమారునికి పెట్టుకున్నారు. ‘సంజీవ’ అంటే ‘ప్రాణం’ అని అర్థం. సంజీవరాయుడు (ఆంజనేయుడు) వారి కులదైవం అనంతపురం జిల్లాలోని ‘నల్లపల్లి’ అనే గ్రామంలో సంజీవరాయుడికి గుడి కట్టించి అర్చించుకునేవారు.

శ్రీ సంజీవరెడ్డికి తండ్రి నుండి అసాధారణ నాయకత్వ లక్షణాలూ, మేనమామ సుబ్బారెడ్డిగారి నుంచి ఆచరణాత్మకమైన వివేకం సంక్రమించాయి.
అనంత భారతీయంలో అనంతపురం జిల్లాలోని ఇల్లూరు అనే కుగ్రామం ఎక్కడా! ఢిల్లీలోని రాష్ట్రపతి భవనం ఎక్కడా! అనంతపురం నుండి దేశాధ్యక్షపదవి వరకూ సాగిన ఈ ప్రయాణం బాబూ రాజేంద్రప్రసాద్, ఎస్. రాధాకృష్ణన్, వి.వి. గిరి, జాకీర్ హుస్సేన్ వంటి దిగ్గజాలకు వారసునిగా రాష్ట్రపతి పదవిని అలంకరించటం ఎంత చరిత్రాత్మకం! ఈ చరిత్రాత్మక ప్రయాణం చేసిన తెలుగునేత డాక్టర్ నీలం సంజీవరెడ్డి దేశభక్తి, స్వశక్తితో ప్రజ్వరిల్లే ఆత్మవిశ్వాసం, ఆత్మీయ, ఆధ్యాత్మిక చింతనాసౌరభం సంజీవరెడ్డిని ప్రథమ పౌరుడి పీఠంవైపుకు ఆత్మీయాభినందనలతో ఆహ్వానాలు పలికాయి.

మహాత్మాగాంధీ ప్రేమపూరితమైన పిలుపు, లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ హృద్యంగగర్జనా ఆయనను సమంగా కదిలించాయి. అరుదైన ఉత్తేజాన్ని హృదయంలో నింపాయి. లౌక్యానికి దూరం చేశాయి.
తన ముందు తరం నుంచీ నీలం హృదయంలో సుస్థిరమైన స్థిరత్వాన్ని సంతరించుకున్న విలువలు ఆయనను రాజకీయ ప్రలోభాలకు అతీతంగా నిలబెట్టగలిగాయి. సంజీవరెడ్డి ఉన్నతశిఖరాగ్రాలను అధిష్టించిన రాజనీతిజ్ఞుడు. ఆయన వ్యక్తిగత జీవితంలో అరుదైన ఇంటి పెద్దగా కన్పిస్తారు. ఆదర్శనీయులైన భర్తగా, మమతానురాగాలను పంచి ఇచ్చే తండ్రిగా, తాతగా, ఆధ్యాత్మిక గురువుగా చైతన్యస్ఫూర్తిగా ఆయన కుటుంబనేపథ్యం అందంగా అల్లబడిన అరుదైన పొదరిల్లు.
ఆత్మీయానుబంధాల నేపథ్యంలో ఆయన నాకు పితృసమానులు, మా కుటుంబానికి ఆత్మబంధువు. ఆయనతోడి సాన్నిహిత్యంలో, ఆత్మీయతతో కూడిన సుదీర్ఘ సాహచర్యంలో జన్మజన్మల అనుబంధం అనుక్షణం సుస్పష్టమౌతూనే ఉంటుంది. ఆయనొక దేశాధినేతగా అన్పించరు. ప్రేమాస్పదులైన ఇంటిపెద్దగానే అనిపిస్తారు. ఆయన వర్ధంతిసందర్భంలో రేఖామాత్రపు స్పందనను అందించగల అదృష్టం కలిగింది ఎప్పటిలాగానే.

మొదటి ప్రపంచయుద్ధకాలం నాటికి సంజీవరెడ్డికి అతి చిన్నవయస్సులోనే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే స్ఫూర్తి బలపరచే దశలో బాలగంగాధర్ వంటి నాయకులు చురుకుగా పనిచేసేవారు. తిలక్ విప్లవాత్మక భావాలు సంజీవరెడ్డిని విపరీతంగా ఆకర్షించాయి. బాల్యం నుంచే చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న సంజీవరెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం ఇల్లూరు వీధి బడిలో జరిగింది. సుక్ష్మగ్రాహి కనుక భారత, భాగవత, రామాయణం మొదలైన గ్రంథాలను చిన్నతనంలోనే అధ్యయనం చెయ్యటానికి అలవాటుపడ్డాడు.
12 సం॥ల వయస్సులో థియోసాఫికల్ పాఠశాలలో, ఆ తరువాత మదనపల్లి రుషీవేలీ పాఠశాలలోనూ, అనంతపురం మున్సిపల్ హైస్కూల్‌లోను చదివారు. హైస్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయనలో జాతీయ భావాలకు అంకురార్పణ జరిగింది. 1922లో మహాత్మా గాంధీ రాయలసీమ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆయన ప్రసంగం విన్న సంజీవరెడ్డి ఎంతో ప్రభావితుడయ్యారు. శ్రీ సంజీవరెడ్డి ఆలోచనలు ఊహలు స్వాతంత్య్రోద్యమం దిశగా పయనించటం మొదలుపెట్టాయి.
శ్రీ సంజీవరెడ్డికి జ్ఞాపకశక్తి అపారం. తాను నేర్చుకున్న మహాభారతంలోని పద్యాలూ, రామాయణ పాత్రలలోని విశిష్టగుణాలు, ఎప్పుడైనా, ఎక్కడైనా, క్రమం తప్పకుండా చెప్పేవారు. క్రమశిక్షణ, సత్యప్రవర్తన, నిర్భయం, నిజాయితీ వంటి లక్షణాల మూలాలు బాల్యంలోనే ఏర్పడ్డాయి.
1929లో గాంధీజీ అనంతపురంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అప్పటికి సంజీవరెడ్డి వయస్సు 16 సం.లు. గాంధీజీ విధానాల పట్ల మరింతగా అభిమానాన్ని పెంచుకుని, సిల్క్ దుస్తులతో ఆయన దగ్గరకు వెళ్ళలేక అప్పటికప్పుడు ఖాదీ దుకాణంలో ఖాదీ బట్టలు తీసుకుని ధరించి, 16 రూపాయలు గాంధీగారి చేతికి విరాళంగా అందించారు. ఆ క్షణం నుంచీ ఖాదీ దుస్తులను తప్ప మరొకటి ధరించలేదాయన.
న్యాయవాది కావాలనుకున్న సంజీవరెడ్డిలో స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనాలన్న కోరిక బలపడిరది.
పేదరిక నిర్మూలన, మాతృభూమిని పరాధీనం లేకుండా చెయ్యటం తనకత్యంత ముఖ్యమైన అంశాలుగా భావించారు. విద్యార్థి దశలోనే తోటి విద్యార్థులను జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొనటానికి సమాయత్తపరిచారు. జిల్లా అంతటా ‘యూత్‌వాక్’తో వేసవి తరగతులను ప్రారంభించి యువతను క్రమశిక్షణతో కూడిన సైన్యంగా సమీకరించి, తమ కాలాన్ని పూర్తిగా నిస్వార్థ రాజకీయాలవైపుకే మళ్ళించారు. గ్రామాలకు పర్యటించి, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను కలిగి, వారివారి సమస్యలను పరిష్కరించటం ఆయన జీవనశైలిలో అంతర్భాగమైంది. మొదటినుండీ ఆయన ప్రజల మనిషే. పరమాత్మీయబంధువే. మాతృభూమి బానిసత్వంతో మగ్గుతుంటే తరగతి గదుల్లో కూర్చోవటం అసాధ్యమన్పించి చదువుకు స్వస్తి చెప్పారు. 1931 సం.లో ‘యువజనసంఘం’ స్థాపించగా, ఈ సంస్థ దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన సంస్థగా ప్రఖ్యాతి వహించింది. 1932, 33 సం.లలో డాక్టర్ పట్టాభి సీతారామయ్య అనంతపురం సందర్శించిన సమయంలో యువనేత సంజీవరెడ్డి గురించి విని, విపరీతంగా ఆకర్షితులై ఆయన కుటుంబనేపథ్యాన్ని తెల్సుకుని ఉత్తేజితుడై, దేశసేవకు ఆహ్వానించారు. అతిచిన్న వయస్సులోనే సీనియర్ నాయకులైన డాక్టర్ పట్టాభి సీతారామయ్య, శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య వంటివారికి అత్యంత ఆప్తులయారు. 1935 సం.లో శ్రీ సంజీవరెడ్డి వివాహం మేనమామ శ్రీ తరిమెల సుబ్బారెడ్డిగారి కుమార్తె నాగరత్నమ్మగారితో జరిగింది. అప్పటికే జాతీయోద్యమంలో ప్రముఖునిగా ముందు నిలిచి, మద్యపాన నిషేధాన్ని ప్రవేశపెట్టాలని శంఖారావాన్ని పూరించారు. 1936లో ఆంధ్రా పొటెన్షియల్ కమిటీకి సెక్రటరీగా ఎంపికై 10 సం.లు పనిచేశారు. ఆయన శక్తియుక్తులు, నిర్మాణాత్మక విధానాలకు సీనియర్ నాయకులు విస్మయం చెందారు. 1940లో వెల్లూరు జైల్లో ఉన్నప్పుడు ‘భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర’ను శ్రీ పట్టాభి సీతారామయ్య చెప్తూ ఉండగా శ్రీ సంజీవరెడ్డి వ్రాసేవారు. ఆ తర్వాత కాలంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులమవుతామని ఇద్దరూ అనుకోలేదు.
1938 అక్టోబర్‌లో వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నందుకు అరెస్టై, తిరుచురాపల్లి జైలుకు, ఆరు నెలల అనంతరం వేలూరు జైలుకూ వెళ్ళటం జరిగింది.
1942 ఆగస్ట్ క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో శ్రీ సంజీవరెడ్డిని అరెస్ట్ చేసి తిరిగి వేలూరు జైలుకి పంపించారు. అక్కడ హేమాహేమీలైన స్వతంత్ర సమరయోధులతో శ్రీ సంజీవరెడ్డి జైలు జీవితం గడిపారు. వేలూరు నుండి ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి జైలుకు మార్చి తరువాత విడుదల చేశారు. అప్పుడే జన్మించిన వీరి మూడవ కుమార్తెకు ‘అమరావతి’ అని నామకరణం చేశారు.
సత్యాగ్రహ సమయంలో శ్రీ సంజీవరెడ్డిని గాంధీజీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. అక్కడకు వెళ్ళాక తిరిగి అరెస్ట్ చెయ్యబడ్డారు. కుమారుడి జాడ తెలియక కన్నీరుమున్నీరు అవుతున్న తల్లి సుబ్బమ్మగారి దగ్గరకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా హుటాహుటిన వచ్చి ఆమెనూ, భార్య నాగరత్నమ్మగారినీ ఓదారుస్తూ – ‘‘దిగులు పడకండి. సంజీవరెడ్డి క్షేమంగా ఉన్నారు. అంతేకాదు, ఆయన భవిష్యత్‌లో దేశాధినేత కూడా అవుతారు’’ అంటూ ఆశీర్వదించారు. అప్పుడు బాబా వయస్సు 10 సం.లు మాత్రమే.
1946 సం.లో జరిగిన శాసనసభ ఎన్నికలలో మద్రాస్ శాసనసభకు అనంతపురం నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికయారు.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆయన రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా ఉండి ‘భారత రాజ్యాంగరచన’లో కీలకపాత్ర వహించారు.
రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, రెండుసార్లు లోక్‌సభ స్పీకర్‌గా, రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికై నిష్కళంక భారతదేశాధ్యక్షునిగా నీరజనాలందుకున్నారు.
50 సం.ల వయస్సులోనే ఆయన అత్యున్నత పదవులను పొందారు. ఏ పదవినీ ఆశించలేదు. పైగా పదవీ పరిత్యాగాలకు ప్రతీకగా నిలిచారు. 1958లో అక్టోబర్ రెండవ తేదీన నెహ్రూ ఆంధ్రరాష్ట్రాన్ని లాంఛనంగా కర్నూల్‌లో ప్రారంభించారు. అధికారపార్టీ నాయకునిగా ఎన్నికై, ముఖ్యమంత్రిగా శ్రీ సంజీవరెడ్డి ప్రమాణస్వీకారం చెయ్యవలసి ఉంది. కానీ, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యవలసిందిగా తన అభ్యర్థనను మన్నించవలసిందిగా ప్రకాశంగారిని వారింటికి వెళ్ళి మరీ అభ్యర్థించారు. ప్రకాశం నివ్వెరపోయారు. తాను ఉపముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. ఈ త్యాగనిరతి ద్వారా ఆంధ్రుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని పొంది అప్పటికే నాయకునిగా పోటీ చేసి ఓటమిపాలైన బెజవాడ గోపాలరెడ్డిని రాష్ట్ర మంత్రివర్గంలో రెండవ స్థానంలో ఉండవలసిందిగా ఆహ్వానించారు. తనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారని తెలిసినా తెలంగాణాకు చెందిన మెహ్దీనవాజ్-జంగ్, కె.వి. రంగారెడ్డిగార్లను స్వయంగా ఆహ్వానించి తన మంత్రివర్గంలో సముచితస్థానం కల్పించగా వారు నిశ్చేష్టులయారు.
1962లో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వీరి కీర్తికి కలికితురాయిగా నిలిచాయి. ప్రతిష్ఠాకరమైన నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ ఆయన ఉపముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మొదలైంది. ఆయన సారథ్యంలో 18 ప్రాజెక్టులు పైగా నిర్మాణదశలో ఉండగా ప్రపంచచరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ అత్యున్నత వ్యవసాయవ్యవస్థగా అగ్రస్థానంలో నిలిచింది.
అత్యున్నత పదవులను సహితం తృణప్రాయంగా త్యజించిన అత్యున్నత సంస్కారి. త్యాగధనుడు, అభిమానధనుడు నీలం. అధికారం, పదవులూ తనకు తృణప్రాయాలనీ, వాటిపైన తనకు వ్యామోహం ఎంతమాత్రం లేదనీ ఎన్నోసార్లు తేటతెల్లం చేశారు. 1977లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో జనతాపార్టీనుండి ఆంధ్రప్రదేశ్‌లో గెలుపొందినవారు శ్రీ సంజీవరెడ్డి మాత్రమే.
1977 జూలైన భారత రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపతగిన రోజు. శ్రీ సంజీవరెడ్డి భారత రిపబ్లిక్‌కు రాష్ట్రపతిగా, ఏకగ్రీవంగా ఎన్నికయారు. భారత రాష్ట్రపతిగా తన పదవీకాలాన్ని పూర్తిచేసుకుని, రాజకీయాలు విరమించుకుని, తన స్వస్థలమైన అనంతపురంలో కొంతకాలం విశ్రాంతి తీసుకుని ఆరోగ్యదృష్ట్యా బెంగళూరులో స్థిరపడిపోయారు.
భారత స్వతంత్ర ఉద్యమ చరిత్రలో ఆయనొక మేరుశిఖరం. స్వతంత్ర భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో నవభారత స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన తిరుగులేని మహానాయకులు. మహోన్నతమూర్తి. మాన్యచరితులు.
వారి ఏకైక కుమారులు డాక్టర్ నీలం సుధీర్‌రెడ్డి ప్రముఖ సర్జన్. మానవత్వంగల వైద్యునిగా అనంతపూర్‌లో నిస్వార్థంగా తన వృత్తిధర్మాన్ని కొనసాగిస్తున్నారు. వీరి ఏకైక పుత్రుడు డాక్టర్ నీలం రమణారెడ్డి తాతగారికి ప్రాణాధికమైన మనుమడు. చివరిదాకా తాతగారినే కనిపెట్టుకుని ఉండిన అదృష్టవంతుడు. హైదరాబాద్‌లో ఆర్థోపెడిక్ సర్జన్‌గా తన బాధ్యతలని నిర్విరామంగా నిర్వహిస్తున్నాడు.
పెద్దకుమార్తె శ్రీమతి నిర్మల, రెండవ అమ్మాయి శ్రీమతి నీరద. మూడవ అమ్మాయి శ్రీమతి అమరావతి, తల్లితండ్రులకి అత్యంత ప్రాణాధికులు కాగా – నేను మా అంకుల్ నీలం సంజీవరెడ్డిగారికీ, ఆంటీకీ మానసపుత్రికని, అత్యంత ఆత్మబంధువుని. అంకుల్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నేనూ, తమ్ముళ్ళు ప్రభాకర్, రామకృష్ణ రాష్ట్రపతి భవన్‌లో ఉన్న సందర్భంలో అంకుల్‌ని అడిగాను, మీ గురించి అరుదైన జీవితచరిత్ర వ్రాయాలని ఉందని.
‘‘తప్పకుండా కృష్ణా! సమయం వస్తుంది’’ అన్నారు.
ఐతే ఆ సమయం అంకుల్ ‘శతజయంతి’ ప్రారంభసమయంలో రాష్ట్రప్రభుత్వం సూచన మేరకు ‘నిష్కళంక త్యాగధనుడు నీలం’ గ్రంథరూపంలో ముఖ్యమంత్రి, గవర్నర్ చేతులమీదుగా 2015 సం.లో ఆవిష్కృతం కాగా ‘నిరుపమాన త్యాగధనుడు నీలం’ గ్రంథరూపంలో అంకుల్ శతజయంతి ఉత్సవాల ముగింపు సమయంలో అనంతపూర్‌లో అప్పటి రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీగారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడిరది. ఐతే హైదరాబాద్‌లో సెక్రటేరియట్ ఎదురుగా నెలకొల్పబడిన ఆ మహనీయుని విగ్రహం అదృశ్యమైంది. ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్రాలకూ, రాష్ట్రపతిగా దేశానికీ గణనీయమైన సేవలు అందించిన ఆ నిరుపమాన నిష్కళంక త్యాగధనుని జయంతి 19వ తేదీ 1913. వర్ధంతి జూన్ 1, 1996 సందర్భాలలోనైనా,, విగ్రహపరంగానైనా వారిని స్మరించుకోవటం, హృదయ సుమాంజలులను సమర్పించుకోవటం మన కనీస ధర్మం కాదా! కాదా! మన నైతిక బాధ్యత కాదా! కాదా!!
వారి విగ్రహం త్వరలోనే ఆవిష్కృతమై కృతజ్ఞతాపూర్వక హృదయసుమాలను అందుకోవాలని మనసా వాచా ఆకాంక్షిస్తున్నాను. ఎందుకంటే – పసివయస్సు నుంచీ పితృవాత్సల్యంతో నన్ను పెంచి, పెద్ద చేసిన ఆ మహోన్నతమూర్తిని ఆ విధంగా కూడా దర్శించుకోవాలన్న కోరిక నాలో ప్రగాఢంగా ఉంది కనుక.
- డా॥ కె.వి. కృష్ణకుమారి, 97040 68673, 79959 19809