ఫైనాన్స్ కంపెనీ వేధింపులకు గిరిజన వ్యక్తి ఆత్మహత్య

ఫైనాన్స్ కంపెనీ వేధింపులకు గిరిజన వ్యక్తి ఆత్మహత్య
ఎ.కొండూరు,ఆంధ్రప్రభ : ఇంటిపై తీసుకున్న రుణం చెల్లింపు విషయంలో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వేధింపులు తాళలేక భూక్యా హనుమ (42) ఉరి పెట్టుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన బుధవారం మండలంలోని పెద్ద తండా లో చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం,పెద్ద తండాకు చెందిన భూక్యా హనుమ నాలుగు సంవత్సరాల క్రితం ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ వద్ద తన ఇంటిని తనఖా పెట్టి 5 లక్షల రుణం తీసుకున్నాడు.
రుణం చెల్లింపు విషయంలో ఫైనాన్స్ కంపెనీకి చెందిన ఏజెంట్లు ప్రతిరోజు హనుమ ఇంటికి వచ్చి రుణం చెల్లింపులో జాప్యం జరుగుతుందని, జాప్యం జరిగితే ఒప్పుకోమని మీ ఇంటిని వేలం వేస్తామని ఉన్న పళాన ఇంటిని ఖాళీ చేయాలని ఇంటికి వచ్చి బెదిరింపులకు గురి చేస్తున్నారు.ఈ పరిస్థితులలో మంగళవారం రాత్రి కూడా ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్లు హనుమ ఇంటికి వెళ్లి రేపు ఉదయానికల్ల మీరు ఇంటిని ఖాళీ చేయాలని లేకపోతే మేమే ఇంట్లో సామాన్లు బయటపడవేస్తామని, బెదిరించారని మృతుని భార్య,భూక్యా బుజ్జి కుమారుడు మణికుమార్ తెలిపారు.
బుధవారం ఉదయం కూడా ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్ ఇంటికి వచ్చి ఇల్లు ఇంకా ఎందుకు ఖాళీ చేయలేదని, హనుమాపై ఆగ్రహం వ్యక్తం చేయగా తీవ్ర మనస్థాపానికి గురైన హనుమ,తన మోటార్ సైకిల్ పై ఊరి బయటకు వెళ్లి ఒక రైతుకు చెందిన మలబార్ షెడ్డులో ఉరి పెట్టుకొని మృతి చెందినట్లు భార్య కుమారుడు తెలిపారు. ఇంటి నుండి వెళ్లిన తన భర్త ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో మృతుని అన్న కుమార్తెలు, హనుమాను వెతకటానికి వెళ్లగా గ్రామ సమీపాన షెడ్డులో శవమై కనిపించాడు.
తన భర్త బలవన్మరణానికి కారణమైన ఫైనాన్స్ కంపెనీ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకొని తనకు తన కుటుంబానికి న్యాయం చేయాలని ఎ. కొండూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు మృతుని భార్య బుజ్జి తెలిపింది.
