ట్రాన్స్‌జెండర్ల స్వాభిమాన ర్యాలీ..

ట్రాన్స్‌జెండర్ల స్వాభిమాన ర్యాలీ..

విజయవాడలో భారీ ఎత్తున నిర్వహణ..
హక్కులు, గౌరవం, ఉద్యోగాలపై చైతన్యం
ప్రభుత్వా దృష్టికి ట్రాన్స్ జెండర్ ల సమస్యలు..
ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం, గౌరవం మా ప్రాధాన్యం
అర్హులందరికీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటాం
ఉద్యోగ అవకాశాల కోసం ముందుకు రావాలి
ఐక్యతే కమ్యూనిటీ బలానికి పునాది
ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రావిపాటి శైలజ

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : విజయవాడలో ట్రాన్స్‌జెండర్ల హక్కులు, గౌరవం, సామాజిక సమానత్వం కోసం గళమెత్తిన ట్రాన్స్ జెండర్ ల స్వాభిమాన సభ విశేషంగా ఆకట్టుకుంది. లెనిన్ సెంటర్ నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో వందలాది ట్రాన్స్‌జెండర్లు పాల్గొని ఐక్యతను ప్రదర్శించారు. కళాక్షేత్రంలో జరిగిన సభలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ ముఖ్య అతిథిగా హాజరై ట్రాన్స్‌జెండర్ల సమస్యలపై విస్తృతంగా స్పందించారు.

సమాజంలో ఇంకా కొనసాగుతున్న వివక్ష, మానసిక ఒత్తిళ్లు వాస్తవమని గుర్తుచేస్తూ, చట్టపరమైన హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయని ఆమె స్పష్టం చేశారు. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం ప్రభుత్వ ప్రాధాన్యాంశమని పేర్కొన్న శైలజ, గతంలో నారా చంద్రబాబు నాయుడు హయాంలో ప్రారంభమైన పెన్షన్ పథకం ప్రాముఖ్యతను ప్రస్తావించారు. ప్రస్తుతం పెన్షన్లు అందని సమస్యలపై సమగ్ర అధ్యయనం జరుగుతోందని, అర్హులైన ప్రతి ట్రాన్స్‌జెండర్‌కు పింఛన్ చేరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఉద్యోగావకాశాల విషయంలో ఇతర రాష్ట్రాల్లో కనిపిస్తున్న పురోగతిని ఉదాహరణగా చూపుతూ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ట్రాన్స్‌జెండర్లు ముందుకు వచ్చి అవకాశాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. విద్యాసంస్థల్లో ఇప్పటికే ఉన్న హక్కులు, సదుపాయాలను సమర్థంగా ఉపయోగించుకోవాలని సూచించారు.

సామాజిక మార్పు కోసం కమ్యూనిటీ ఐక్యత అత్యవసరమని, ట్రాన్స్‌జెండర్లు ఓటర్లుగా మాత్రమే కాకుండా అభివృద్ధి భాగస్వాములుగా నిలవాలని ఆమె పేర్కొన్నారు. సమాజం నుంచి సహకారం లభిస్తేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ట్రాన్స్‌జెండర్ల సమస్యలను ప్రధానప్రవాహ చర్చకు తీసుకువచ్చి, ప్రభుత్వానికి స్పష్టమైన సూచనలు అందించిన వేదికగా నిలిచింది.

Leave a Reply