పెనుమూరులో విషాదం…
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రియురాలి ఎడబాటు తట్టుకోలేక మైనర్ ప్రేమికుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరు మండలంలో చోటు చేసుకుంది.
ఆత్మహత్య చేసుకునే ముందు, అరవింద్ తన సూసైడ్ నోట్‌లో.. “అమ్మా, నాన్నా సారీ… నేను మిమ్మల్ని వదిలి వెళ్తున్నాను. నన్ను క్షమించండి. డాడీ, నాకు బతకాలని లేదు. నావల్ల నీవు చాలా బాధ పడ్డావు… సారీ డాడీ. ఆ పిల్ల నన్ను చాలా నమ్మించింది, నాతోనే ఉంటానని చెప్పింది. కానీ మోసం చేసింది. నా వల్ల కాదు డాడీ… మీ కోసం బతకాలని ఉంది కానీ నన్ను క్షమించండి, సారీ డాడీ… అందరినీ వదిలి వెళ్తున్నాను.” అని రాశాడు.
వివరాల్లోకి వెళ్తే..
పెనుమూరు మండలం ఎర్రమట్టిపల్లికి చెందిన అరవింద్ (17) పెనుమూరులోని తిరుమల ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అదే కళాశాలలో, అదే తరగతిలో ఎర్రవారిపాలెంకు చెందిన ముస్లిం యువతి (19) చదువుతోంది. ఆ యువతి పెనుమూరులో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటోంది.
ఒకే తరగతిలో చదువుతున్న వీరి మధ్య స్నేహం, క్రమంగా ప్రేమగా మారి గాఢమైన అనుబంధంగా మారింది. ఇటీవల ఇద్దరూ పెద్దల అనుమతి లేకుండానే అక్టోబర్ 24న పెళ్లి చేసుకుని పారిపోయారు.
ఈ విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అబ్బాయి బంధువులకు ఫోన్ చేసి కనుక్కోగా.. వారు విజయవాడ గన్నవరంలో ఉన్నట్లు సమాచారం ఇవ్వడంతో, అబ్బాయి తండ్రి పరంధాం, ఒక ఏఎస్ఐ, ఒక కానిస్టేబుల్‌తో కలిసి వెళ్లి వారిని మంగళవారం రాత్రి పెనుమూరుకు తీసుకువచ్చారు.
బుధవారం ఇరువురి తరపున పెద్దమనుషులు పోలీస్ స్టేషన్‌లో మాట్లాడారు. అక్కడ కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు… అమ్మాయి మేజర్ అయినా అబ్బాయి మైనర్ కావడంతో వివాహం చట్టబద్ధం కాదని స్పష్టం చేశారు. ఇరువురి పెద్దలు మాట్లాడుతూ, ఇద్దరూ బాగా చదువుకుని స్థిరపడిన తర్వాత వారి మద్య ప్రేమ అలాగే ఉంటే అప్పుడే పెళ్లి జరిపిస్తామని హామీ ఇచ్చారు.
అబ్బాయి తండ్రి పరంధాం మాట్లాడుతూ.. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం వచ్చేలా తానే సహాయం చేస్తానని, అదే అమ్మాయితో పెళ్లి చేస్తానని అబ్బాయికి హామీ ఇచ్చాడు. అమ్మాయిని వాళ్ల సొంత ఊరైన ఎర్రవారిపాలెంకు తీసుకెళ్లారు.
మూడు రోజులపాటు బాగానే ఉన్నా, అబ్బాయి అరవింద్ ఆదివారం మధ్యాహ్నం ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో ఎర్రమట్టిపల్లి, పెనుమూరు ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఈ ఘటనపై పెనుమూరు పోలీసులు కేసు నమోదు చేసి, తాలూకా సీఐ నిత్యబాబు ఆధ్వర్యంలో ఎస్సై వెంకట నరసింహ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

