Traffic rules | అరైవ్–అలైవ్’ కార్యక్రమంలో అవగాహన చర్యలు

Traffic rules | అరైవ్–అలైవ్’ కార్యక్రమంలో అవగాహన చర్యలు
- ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరి : జడ్జి
- విద్యార్థులు రోడ్డు భద్రత రాయబారులుగా మారాలి : ఏసీపీ
Traffic rules | గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా “అరైవ్ – అలైవ్” కార్యక్రమంలో భాగంగా భవిష్యత్తులో రోడ్డు ప్రమాద రహిత సమాజం నిర్మాణం, ప్రమాదాల్లో మరణాల నియంత్రణ లక్ష్యంగా మండల న్యాయసేవాధికార సంస్థ, గోదావరిఖని ట్రాఫిక్ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాల(Traffic rules)పై ఈ రోజు అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి డా.టి.శ్రీనివాసరావు, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జడ్జి డా.టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ… ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం ప్రాధాన్యత, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలు, మైనర్లు వాహనాలు నడిపితే ఎదురయ్యే న్యాయపరమైన సమస్యలను విద్యార్థులకు వివరించారు. రోడ్డు ప్రమాదాల సందర్భంలో బాధితుల హక్కులు, పౌరుల బాధ్యతలపై న్యాయసేవాధికారులు అవగాహన కల్పించారు.

అనంతరం జడ్జి, పోలీస్ అధికారులతో కలిసి జెండా ఊపి అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు(District Court) నుంచి గాంధీ చౌక్ వరకు విద్యార్థులతో కలిసి రహదారి భద్రతపై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించి, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఏసీపీ ఎం.రమేష్ మాట్లాడుతూ… యుద్ధాల కంటే ఎక్కువగా నిత్య జీవితంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్లు వాహనాలు నడపడం, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్(wrong route driving), మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి కారణాల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. విద్యార్థి దశ నుంచే రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులకు అవగాహన కల్పిస్తూ సమాజంలో మార్పుకు దోహదపడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి డా.టి.శ్రీనివాసరావు, సెషన్స్ న్యాయమూర్తి ఐ.సురత్ రాజ్ సింగ్, ప్రధాన న్యాయమూర్తి (ప్రిన్సిపల్ జడ్జి) ఎన్.వెంకట సచిన్ రెడ్డి, ద్వితీయ అదనపు న్యాయమూర్తి ధ్రువ వెంకటేష్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్, రామరాజు, లాయర్లు, కోర్టు సిబ్బంది, ప్రభుత్వ, శ్రీ చైతన్య మహర్షి డిగ్రీ కళాశాల విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
