నిమ‌జ్జ‌నోత్స‌వ వేళ సిటీలో ట్రాఫిక్ ఆంక్ష‌లు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : హైదరాబాద్ (Hyderabad)లో వినాయ‌క చ‌వితి (Vinayaka Chavithi) వేడుక‌లు ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయి. శ‌నివారం నిమ‌జ్జ‌నోత్స‌వానికి అధికారులు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈ నేప‌థ్యంలో న‌గ‌రంలో ట్రాఫిక్ ఆంక్ష‌లు (traffic restrictions) విధించారు. అలాగే నిమజ్జనం కోసం ట్రాఫిక్ పోలీసులు రూట్ మ్యాప్ ప్రకటించారు. సెప్టెంబర్ 6 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 ఉదయం 10 గంటల వరకు ప్రత్యేక ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. బాలాపూర్ (Balapur) నుంచి ప్రారంభమయ్యే ప్రధాన శోభాయాత్ర చార్మినార్–అబిడ్స్–లిబర్టీ–ట్యాంక్‌బండ్–నెక్లెస్ రోడ్ మీదుగా సాగనుంది. ఖైరతాబాద్ గణపతి (Khairatabad Ganpati)ని విజయవాడ (Vijayawada) నుంచి తెప్పించిన ప్రత్యేక టస్కర్ ట్రాలీ ద్వారా హుస్సేన్ సాగర్ (Hussain Sagar)లో నిమజ్జనం చేయనున్నారు. భక్తుల సౌకర్యం కోసం ఎన్టీఆర్ స్టేడియం (NTR Stadium), కట్టమైసమ్మ ఆలయం, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధభవన్ వెనుకభాగం, ఆదర్శనగర్, బీఆర్‌కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటిఎస్ స్టేషన్ వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.

భారీ వాహ‌నాల‌కు నో ప‌ర్మిష‌న్‌
సెప్టెంబర్ 6 ఉదయం 8 నుంచి సెప్టెంబర్ 7 రాత్రి 11 వరకు నగరంలోకి లారీలు రాకుండా ఆంక్షలు అమల్లోకి వస్తాయి. లారీలు కేవలం ఔటర్ రింగ్ రోడ్ (Outer Ring Road) మీదుగా మాత్రమే నడవాలి. ఆర్టీసీ బస్సులు (RTC buses) పీక్ టైంలో మెహిదీపట్నం, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, నారాయణగూడ వరకు మాత్రమే నడుస్తాయి. అంతర్రాష్ట్ర, జిల్లా బస్సులు చాదర్‌ఘాట్ మార్గం ద్వారా మళ్లించబడతాయి. ఎంజే మార్కెట్, ఖైరతాబాద్, అబిడ్స్, లిబర్టీ, రాణిగంజ్, తెలుగు తల్లి చౌరస్తా, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా వంటి జంక్షన్లను వాహనదారులు తప్పించుకోవాలి. విమానాశ్రయం వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే లేదా ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే ఉపయోగించాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళే ప్రయాణికులు బేగంపేట్–ప్యారడైజ్ రూట్ ఎంచుకోవాలి.

Leave a Reply