Traffic Restrictions | పెద్ద గట్టు జాతర – హైదరాబాద్ – విజయవాడ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్-విజయవాడ మధ్య రాకపోకలు చేసే వాహనదారులు సూర్యాపేట మీదుగా కాకుండా నల్లగొండ మీదుగా రాకపోకలు చేయాల్సి ఉంటుంది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో దురాజ్‌పల్లిలో జాతర జరుగుతుంది. ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాలకు సుమారు 20 నుంచి 25 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షలుజాతీయ రహదారి-65పై ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సూర్యాపేట ఎస్‌పీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలు నేటి నుంచే అమల్లోకి వస్తాయన్నారు. హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్లు వాహనాలను నార్కట్ పల్లి వద్ద మళ్లించి నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ మీదుగా విజయవాడకు మళ్లించనున్నారు. అలాగే విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాలను కోదాడ వద్ద మళ్లించి హుజూర్ నగర్, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్‌పల్లి మీదుగా హైదరాబాద్ కు మళ్లించనున్నారు.