Traffic Police | జరిమానాలపైనే.. ఫోకస్!

Traffic Police | జరిమానాలపైనే.. ఫోకస్!
- ఫొటోగ్రాఫర్ల అవతారమెత్తిన ట్రైసిటీ ట్రాఫిక పోలీసులు
- హెల్మెట్ లేకుంటే ఎడాపెడా ఫొటోలు
- అసలు విధులు గాలికి.. అస్తవ్యస్తంగా ట్రాఫిక
- ద్విచక్ర వాహన చోదకుల ఆందోళన
ఆంధ్రప్రభ, గ్రేటర్ హైదరాబాద్ బ్యూరో : హెల్మెట్ ధరించ లేదా.. కుటుంబ శ్రేయస్సు దృష్ట్యా ధరించండి.. అంటూ వాహన చోదకుల చేతిలో గులాబీ పువ్వు పెట్టి చెప్పేవారు. ఇదంతా గతం.. కానీ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా ట్రాఫిక్ పోలీసుల తీరు మాత్రం మారడంలేదు. ట్రై సిటీలో ఎక్కడ ప్రయాణిస్తున్నా.. హెల్మెట్ లేకుంటే చాలు రద్దీ రోడ్లమీద కూడా అడ్డంగా వచ్చి ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఫొటోలు తీయడం ఫ్యాషన్ అయిపోయిందని ద్విచక్ర వాహన చోదకులు మండిపడుతున్నారు.
చిన్న, చిన్న పనుల మీద స్వల్ప దూరాలకు బయటకొచ్చినప్పుడు హెల్మెట్ తప్పనిసరి అంటే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్, ఉప్పల్, నాగోల్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, ఖైరతాబాద్, కోఠి, అబిడ్స్, మలక్‌పేట్, చంపాపేట్, తిరుమలగిరి, కొంపల్లి, బేగంపేట్ ట్రాఫిక్ పోలీసులు కొద్ది నెలలుగా ఫొటోగ్రాఫర్ అవతారమెత్తి అసలు విధులు పక్కనపెట్టేస్తున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కన్నా జరిమానాలు విధించడంపైనే ఎక్కువగా దృష్టిపెట్టారని పలువురు వాహన చోదకులు ఆరోపిస్తున్నారు.
Traffic Police హెల్మెట్ కేసులే టార్గెట్ :
మూడు కమిషనరేట్ల పరిధిలో జంక్షన్ల వద్ద నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆయా పరిధిలో తరచూ చిన్నా, పెద్దా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇటువంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకల క్రమబద్దీకరణను మర్చిపోయి హెల్మెట్ కేసులు నమోదు చేయడమే ధ్యేయంగా పనిచేయడం తీవ్ర దుమారం రేపుతోంది.
దీంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారుతోంది. ఎవరికి నచ్చినట్టు వారు వాహనాలపై ప్రయాణిస్తున్నారు. పలువురు వాహన చోదకులు అత్యవసర పనుల మీద వెళ్లేటపుడు కూడా ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేదంటూ వాహనం ఆపి ఫొటోలు తీయడం, కేసులు రాయడం సర్వ సాధారణమైంది. ఎడాపెడా ఫొటోలు తీస్తున్నా ట్రాఫిక్ పోలీసులు.. అసలు విధులను పక్కన పెట్టేస్తున్నారని ద్విచక్ర వాహన చోదకులు విమర్శిస్తున్నారు.
ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్న వాహనాలు, తోపుడు బండ్లను తొలగించడం, అడ్డదిడ్డంగా వాహనాలు పార్క్‌చేస్తున్న వారిని వారించడం మానేసి కేవలం ఆయా జంక్షన్లలో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహన చోదకులను ఆపి ఫొటోలు తీయడమే పనిగా పెట్టు-కోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.

ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి అవసరం :
ట్రాఫిక్ విభాగం అధికారులు కూడా ప్రభుత్వానికి జరిమానాల ఆదాయం పెంచడమే ధ్యేయంగా పెట్టుకున్నారో ఏమోగాని.. కానిస్టేబుళ్లు మాత్రం మొబైల్ ఫోన్లకు పనిచెబుతూనే ఉంటున్నారు. నగరంలో ప్రయాణాలు చేసేవారు హెల్మెట్ ఎలాగూ ధరిస్తారు. ఇంటి నుంచి స్వల్ప దూరంలోనే ఉన్న దుకాణాలు, ఆస్పత్రులకు వెళ్లేటప్పుడు కూడా హెల్మెట్లు లేవంటూ ఫొటోలు తీసి వేధిస్తున్నారని పలువురు వాహన చోదకులు వాపోతున్నారు.
పైగా ఈ కేసులు నమోదైతే మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో వాహన చోదకులు బెంబేలెత్తిపోతున్నారు. రోడ్డు మీద ఉన్న గోతులను పూడ్చకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదని, హెల్మెట్ ధరించడం లేదని వేధించడం ఎంతవరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు. ద్విచక్ర వాహన చోదకులను ఇబ్బంది పెట్టడం మానేసి.. ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి సారించాలని నగర ట్రాఫిక్ పోలీసులకు సూచిస్తున్నారు.
