Traffic junction | టాక్టికల్ అర్బనిజంతో అక్రమణల తొలగింపు..

Traffic junction | టాక్టికల్ అర్బనిజంతో అక్రమణల తొలగింపు..

  • కాన్వెంట్ రోడ్డులో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్…
  • నగర పోలీస్ ఆదేశాలతో ప్రత్యేక చర్యలు …
  • దుకాణదారులకు కౌన్సిలింగ్, పార్కింగ్ నియంత్రణకు స్పష్టమైన సూచనలు…

Traffic junction | భవానిపురం, ఆంధ్రప్రభ : ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ షీరిన్ బేగం సూచనలతో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ నిర్వహించారు. వన్ ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు స్వీయ పర్యవేక్షణలో, వన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏ. ఉమామహేశ్వరరావు సిబ్బందితో కలిసి ఈ చర్యలు చేపట్టారు. విజయవాడలో వన్ ట్రాఫిక్ జంక్షన్ నుంచి కాన్వెంట్ రోడ్ మీదుగా తారపేట వరకు రోడ్డుకు ఇరువైపులా పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, సాధారణ ట్రాఫిక్‌కు అడ్డంకిగా మారిన వివిధ రకాల దుకాణాల వస్తువులను తొలగించారు. రోడ్డుపై అడ్డదిడ్డంగా విక్రయాల కోసం ఉంచిన సామగ్రిని తొలగించడంతో పాటు, దుకాణదారులకు అక్కడికక్కడే అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలను రోడ్డుపై నిలుపుదల చేయడం వల్ల ట్రాఫిక్‌కు ఎలా అంతరాయం కలుగుతోందో ప్రత్యక్షంగా చూపించారు. రైల్వే స్టేషన్ వైపు నుంచి కాన్వెంట్ రోడ్ వైపు వన్‌వే నిబంధనలను ఉల్లంఘిస్తూ వాహనాలు రావడం వల్ల సాధారణ ప్రజలకు, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులు వివరించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాల విద్యార్థులు, కొనుగోలుదారులు అధికంగా రాకపోకలు సాగించే ఈ రోడ్డులో వ్యాపారం నిర్వహించేటప్పుడు ట్రాఫిక్‌కు భంగం కలగకుండా బాధ్యతగా వ్యవహరించాలని దుకాణదారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

ప్రత్యామ్నాయంగా, వారానికి కొన్ని రోజులు ఒకవైపు, కొన్ని రోజులు మరోవైపు వాహనాలు నిలుపుకునే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. దీనిపై స్పందించిన దుకాణదారులు, వన్‌వే ఉల్లంఘనలు జరగకుండా వాచ్‌మెన్ ఏర్పాటు చేస్తామని, సాధారణ ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్‌ఐ ఓంకార్, టూ టౌన్ ఎస్‌ఐ రెడ్డి, ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply