Tourist attractions | ఓరుగల్లుకు పర్యాటక సొబుగులు..
- సరికొత్త ప్రతిపాదనలు సిద్ధం
- భద్రకాళీ ఆలయం నుండి భద్రి బండ్ వరకు రోప్ వే
- గ్లాస్ బ్రిడ్జ్ స్కై వాక్ ప్రాజెక్ట్ కై కసరత్తు
ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్ : ఓరుగల్లు మహనగరంకు పర్యాటక సొబగులు (Tourist attractions) తీసుకొచ్చే ప్రయత్నాలు, ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాకతీయ సామ్రాజ్య రాజధానిగా విరాజిల్లిన ఓరుగల్లుకు పర్యాటకుల రాక పెరుగుతోంది. దాంతో వరంగల్ ను పర్యాటకులను మరింత ఆకర్షించేందుకు సరికొత్త ప్రణాళికల అవసరాన్ని గుర్తించారు. అందుకు గాను అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టిని సారించారు.
Tourist attractions | టూరిజం ప్రాజెక్టుల ప్రెజెంటేషన్
అందులో భాగంగానే ఓరుగల్లు ఇలావేల్పుగా విరాజిల్లుతున్న భద్రకాళి దేవాలయం నుండి భద్రకాళి బండ్ వరకు ప్రతిపాదిత రోప్‌వే, గ్లాస్ బ్రిడ్జ్ స్కై వాక్ ప్రాజెక్ట్ అమలు కోసం పలు సంస్థల ప్రతినిధులు తమ ప్రెజెంటేషన్లు సమర్పించారు. ఈ ప్రెజెంటేషన్లను కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (K.U.D.A) వైస్ చైర్మన్ చాహాత్ బాజ్ పాయ్ గురువారం సాయంత్రం, సమీక్షించారు.

ఈ సందర్భంగా వైస్ చైర్మన్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ, రోప్‌వే , గ్లాస్ బ్రిడ్జ్ స్కై వాక్ ప్రాజెక్టులు అమలుతో పర్యాటక అభివృద్ధికి కొత్త ఊపునిస్తాయన్నారు. నగర సౌందర్యాన్ని మరింతగా పెంచి సందర్శకులకు కనువిందు కలిగిస్తాయన్నారు. రోప్‌వే నిర్మాణానికి సంబంధించి సాంకేతిక, ఆర్థిక అంశాలను సమగ్రంగా పరిశీలించిన తరువాత తుది నిర్ణయం తీసుకునే ప్రక్రియ కొనసాగుతుందనిచాహత్ బాజ్ పాయ్ పేర్కొన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో కుడా పిఓ అజిత్ రెడ్డి,తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కుష్మాన్, ఐ డెక్, ఫైన్ సంస్థ ల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


