పెద్ద పెద్ద సౌండ్స్‌తో దూసుకెళ్తున్న బైకులు
వీధుల్లోనేమో డీజే మిసైల్స్
జనం గుండెల్లో ఒకటే దడదడ
బందరు.. గుడివాడల్లో మితిమీరిన హారన్ల రొద
అర్ధరాత్రి మైకుల్లో కేకలు
అల్లాడుతున్న గ్రామీణులు
అదుపు లేని సౌండ్ పొల్యూషన్
పకృతిలో కోయిలమ్మ కుహూ కుహూ రాగాలు..చిలుకమ్మ కిలకిల రావాలు.. పిచ్చుకలు, గువ్వల సందడి, సెలయేళ్ల పరవళ్లు.. సరిగమ పదనిసల సంగీత ఝరికి పునాదులు. ఉల్లాసం,, ఉత్సాహం పంచే ఈ గమకాలు శబ్ధ కాలుష్య అవతారం ఎత్తింది. డమ డమ అంటూ బుల్లెట్టు బండ్లు వీధిలోకి అడుగు పెట్టగానే గుండె దడ దడ దద్దరిల్లుతోంది. ఇక సైలన్సర్ తీస్తే.. ఆ విధ్వంసమే వేరబ్బా. డాం.. డాం అంటూ బాంబుల మోత .. జనాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తుంటే.. అడ్డుకోవాల్సిన పోలీసులు రోడ్డు పక్కన ఉచిత జ్యూస్ తాగుతూ వీధి వినోదం పంచుకోవటం సర్వసాధారణంగా మారింది. జనం ప్రాణాలను తీసే మహా ఉత్పాతంగా అవతరిస్తున్న ఈ సౌండ్ పొల్యూషన్ ఏంటో తెలుసా? ఇది ఒక సైకో కిల్లర్. ఈ సైకోను అడ్డుకోవటం అత్యవసరం. అనివార్యం. అతి సంగీత గతి, స్థితిని ఒక్కసారి పరిశీలిద్దాం.
మచిలీపట్నం ప్రతినిధి, ఆంధ్రప్రభ (Machilipatnam staffer – andhraprabha)
ఇంట్లో ఏదేని పని హడావిడిగా చేస్తూ పొరపాటున చేతిలో ఉన్న స్టీల్ వస్తువు జారి కింద పడితే అసహనానికి గురి అవుతాం. కొన్ని క్షణాల పాటు వచ్చిన శబ్దానికి చికాకు పడే మనం ఆధునిక జీవన శైలిలో రోజంతా వివిధ వాహనాలు, మోటార్లు చేసే శబ్దాలతో సహజీవనం చేస్తున్నాం. వివిధ రకాలైన శబ్దాలు పరిమితికి మించి చెవిని తాకడాన్ని శబ్ద కాలుష్యం అంటారు. శబ్ద కాలుష్యం మానవ శారీరక మానసిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. కాలుష్యం అంటే నీటి కాలుష్యం, వాయు కాలుష్యం మాత్రమే ప్రమాదకరమైనవి అని భావిస్తుంటాం. కానీ శబ్ద కాలుష్యం కూడా మానవ జీవ వ్యవస్థపై అధిక ప్రభావాన్ని చూపిస్తోంది. మానవ చెవి నిర్దిష్ట పౌనఃపున్య పరిధిలో అంటే సాధారణంగా 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ మధ్య గల శబ్దాలను వినగలదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పక్రారం.. 65 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దస్థాయిని శబ్ద కాలుష్యంగా పరిగణిస్తారు. 75 డీబీ కంటే ఎక్కువ శబ్దం స్థాయి చాలా హానికరం. శబ్ద కాలుష్యం భూమిపైగల జీవజాతులతో పాటుగా, సముద్రంలో నివసించే జీవజాతులను సైతంప్రభావితం చేస్తోంది. కానీ పెరుగుతున్న మోటార్ బైకుల వల్ల, కారుల వల్ల రోజు రోజుకి శబ్ద తీవ్రత పెరిగి అది ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. మహా నగరాలలో ఈ శబ్ద కాలుష్యం పరిమితిని ఎప్పుడో దాటేసింది. ఇప్పుడు వర్ధమాన నగరం మచిలీపట్నం, నగర స్థాయికి ఎదుగుతున్న గుడివాడ.. అంతే కాదు.. మున్సిపాలిటీల్లోనే కాదు.. అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే రొద.. కర్ణభేరిపై దాడి. ఈ శబ్ద కాలుష్యం రెక్కలు విప్పు కుంటోంది. సైలెన్సర్లు లేని బైకులు.. మితిమీరిన హారన్ల వాహనాలు… ఇక డీజేలే.. శబ్ద కాలుష్య ఉత్పాతానికి ప్రధాన కారణాలు.
పోలీసులంటే లెక్కలేదంతే
పోలీసుల ఉత్తర్వుల ప్రకారం నివాస ప్రాంతాలలో ధ్వని తీవ్రత పగటిపూట 55 డీబీ, రాత్రివేళ 45డీబీ, వాణిజ్య ప్రాంతాల్లో పగటి పూట 65డీబీ, రాత్రి 55 డీబీ, పారిశ్రామిక ప్రాంతాల్లో పగటిపూట 75 డీబీ, రాత్రి 70 డీబీకి మించకూడదు. రాత్రి10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ లేదా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లేదా డీజే సిస్టమ్ ఉపయోగించరాదు. మ్యూజిక్ పరికరాలను అద్దెకు తీసుకుకోవాలంటే సౌండ్ సిస్టమ్స్ సరఫరా వ్యక్తులకు పోలీస్ క్లియరెన్స్ అవసరం. కానీ పట్టణ, నగరాల్లో సైలెన్సర్లు లేని బైకుల రొద, డీజె ల గుండదడ.. ఇక గ్రామాల్లోనూ శబ్ధకాలుష్యం ఎక్కడ తగ్గటం లేదు. అపరాత్రి లేదు. అర్థరాత్రి లేదు. క్రైస్తవ కూటములు.. పెద్ద పెద్ద కేకలు .. ఈ గోలతో పగలంతా పొలాల్లో పని చేసి.. అలసటతో నిద్రపోయే జనాన్ని .. ఈ క్రైస్తవ గురువులు తమ కేకలతో అల్లాడిస్తున్నారు. ఇదిలా ఉంటే.. వీరికి పోటీగా హిందూత్వ సంస్థలు రంగంలోకి దిగాయి. భజనలతో జనాన్ని అల్లాడిస్తున్నారు. వీరందరికీ పోలీసులు అనుమతి తప్పనిసరి .. ఇక జనం మాత్రం శబ్దకాలుష్యానికి బలి పశువులు కావాల్సిందే.
రేసు గుర్రాలకు ముక్కుతాడేది ?
నేటి మారిన ఆధునిక జీవన శైలిలో ప్రతి చిన్న పనికీ… మోటార్ వాహనాల మీద, మోటార్ల మీద ఆధారపడడం తప్పనిసరి అయింది. మోటార్లు చేసే శబ్దాన్ని నిరోధించడానికి వాటికి తయారీదారులు సైలెన్సర్లు అమరుస్తారు. కానీ తయారీదారులు ఇంజన్లకు ఏర్పాటు చేసిన సైలెన్సర్లను తొలగించి మరీ విపరీతమైన శబ్దం చేస్తూ కొందరు ఆకతాయిలు రోడ్లపై వాహనాలు నడుపుతున్నారు. తయారీదారు వాహనంతో అమర్చిన హారన్ లను తొలగించి వింత వింత శబ్దాలతో కూడిన హారన్ లను బిగిస్తున్నారు. వింత శబ్దాలతో కూడిన హారన్ లను పెద్దగా మోగిస్తూ శబ్ద కాలుష్యానికి కారణమౌతున్నారు. ఎక్కువ సీసీ, కొత్త టెక్నాలజీ తో వచ్చే ద్విచక్ర వాహనాలలో ఇంజిన్ శబ్దాన్ని నిరోధించకుండా ఉండేలా సైలెన్సర్లు ఏర్పాటు చేస్తున్నారు. యువతను ఆకర్షిస్తూ సమాజంలో శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలను నిషేధించాల్సిన అవసరం ఉంది.
చాలిక.. ఆపండ్రోయ్
రక రకాల ఫంక్షన్లకు, ఉత్సవాలకు డీజే ఏర్పాటు నేటి తరం పోకడ. ఈ డీజే వల్ల విపరీతమైన శబ్ద కాలుష్యం ఏర్పడుతుంది. ఈ మధ్య కాలంలో డీజే శబ్దాలు కొంతమంది పాలిట మృత్యు శబ్దాలుగా మారి ఆయా కార్యక్రమాలలో పాల్గొన్న వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. డీజే లలో పాటలు వినే హృద్రోగుల గుండె లబ్ – డబ్ అని కొట్టు కోవడం మాని ఆపండ్రోయ్… ఆపండ్రోయ్… అని బెంబేలెత్తుతుంది. డీజే లను నిషేధించాలనే డిమాండ్లు రోజు రోజుకూ పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతానికైతే అవి మానవ ఆరోగ్యాన్ని స్పీకర్లలో వేసి ఆడిస్తున్నాయి.
ఈ కష్టాలతో.. అల్లాడాల్సిందే
శబ్ద కాలుష్యంతో తీవ్ర శారీరక సమస్యలు … వినికిడి లోపం, గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటు, నిద్రలేమి, అలసట, టిన్నిటస్ (చెవులలో శబ్దాలు వినిపించడం) తో పాటు చికాకు, అధిక ఒత్తిడి, ఏకాగ్రత తగ్గడం వంటి మానసిక ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. శబ్ద కాలుష్యాన్ని నియంత్రించవలసిన బాధ్యత స్థానిక పోలీస్, రెవిన్యూ, మునిసిపల్ కాలుష్య నియంత్రణ బోర్డు పై ఉంటుంది. కానీ ఆ దిశగా ఏ శాఖా కూడా తగిన కార్యాచరణతో లేదన్నది సుస్పష్టం. ఏదేని తప్పని సరి పరిస్థితులలో సంబంధిత వాహనాలపై లేదా కాలుష్య కారకాలపై జరిమానా వసూలుతో సరి పెడుతున్నారు. కానీ ఈ శబ్ద కాలుష్యంతో పసి పిల్లలూ, వృద్ధులూ, హృద్రోగులూ అల్లాడిపోతున్నారు. ఇది నిజం.