అభివృద్ధి పేరుతో విధ్వంసం వద్దు
వర్సిటీ భూముల్లో అటవీ ప్రాంతం
చెరువులు, కుంటలతో నీటి లభ్యత
వన్య ప్రాణులకు నెలవుతుగా హెచ్‌సీయూ
వనాలను నరికేసి నవ నాగరికత తెస్తారా?
అటవిక చర్యలు వద్దంటున్న విద్యార్థులు
700కు పైగా పూలజాతి మొక్కలు
200కు పైగా పక్షి జాతుల నిలయం
15 జాతుల సరీసృపాలున్నయ్
10 జాతుల క్షీరదాలు కనిపించకుండా పోయే ప్రమాదం
హరితవనం కాస్త.. కాంక్రిట్ జంగిల్‌గా మారిపోతుంది
ప్రభుత్వం తీరుపై స్టూడెంట్స్ తిరుగుబాటు
యూనివర్సిటీ భూముల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడాలి
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :
కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని ప్రైవేటు సంస్థలకు వేలం వేయాలని టీజీఐఐసీ రంగం సిద్ధం చేసింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వివిద్యాలయం విద్యార్థులు ఈ వేలం ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఆందోళన బాటపట్టారు. ఈ భూమి తమదేనని ఇటు తెలంగాణ సర్కారు.. అటు కేంద్రీయ విశ్వవిద్యాలయం అధికారులు వాదనలకు దిగారు. ఈ లోపులోనే రాత్రి పగలు తేడా లేకుండా దాదాపు వందలాది ఎక్స్కవేటర్లతో ఆ భూములను చదును చేసే ప్రక్రియను సర్కారు ముమ్మరం చేసింది.
50 ఎకరాల్లో చెట్లు, పుట్టల తొలగింపు..
చెట్లను తొలగించే పనిలోభాగంగా వందలాది బుల్జోజర్లను ప్రభుత్వం దించింది. ఇప్పటికే 50 ఎకరాల్లో తుప్పలు.. మొక్కల్ని తుంచేసింది. ఈ ప్రక్రియపై విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. ఇక బీఆర్ఎస్, బీజేపీ రంగంలోకి దిగాయి. వర్సిటీకి, విద్యార్థులకు మద్దతు పలికాయి. వేలాన్ని ప్రభుత్వం వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే, ఆ భూములు ప్రభుత్వానివేనంటూ టీజీఐఐసీ ఆధారాలను బయటపెట్టింది. ఈ భూములను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హెచ్‌సీయూ స్వాధీనం చేసిందని, దానికి బదులుగా వర్సిటీకి సర్కారు 397 ఎకరాలను బదలాయించిందని స్పష్టం చేసింది. దీనిపై అప్పటి వర్సిటీ రిజిస్ట్రార్ సంతకం చేశారని తెలిపింది. సంబంధిత కాపీలను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) విడుదల చేసింది. అయితే.. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని టీజీఐఐసీ చేసిన ప్రకటనను హెచ్‌సీయూ రిజిస్ట్రార్ ఖండించారు. దీంతో ఇప్పుడు ఈ అంశం చర్చనీయంగా మారింది.
ఇదొక అభయారణ్యం
ఇప్పటికే అభివృద్ధిలో భాగనగరం విశ్వనగరి దిశలో దూసుకుపోతోంది. కాంక్రీట్ వనాలు విస్తరిస్తున్నాయి. పచ్చదనం కడసారి చూపునూ నోచుకోలేని దైన్య స్థితి చేరింది. పదేళ్ల కింద నాటిన హరితహారం మొక్కల్లో కొన్ని పెరిగితే.. ఇంకొన్ని రాలిపోయాయి. ఇక.. సున్నిత పర్యావరణ ప్రాంతాల్లో కీలకంగా మారింది హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఒక భాగం.. కాగా వాణిజ్య అభివృద్ధి పేరిట ఈ భూములపై బుల్డోజర్ దాడి జరుగుతోంది. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని వేలం వేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిధిలో పర్యావరణ సమతుల్యతకు ముప్పు తప్పని స్థితి ఏర్పడిందని, హైదరాబాదీ ఊపిరితిత్తులు శల్యం కావటం తథ్యమని పర్యావరణ ప్రేమికులు గగ్గోలు పెడుతున్నారు. అనేక పక్షి జాతులు, క్షీరదాలు, ఔషధ మొక్కలకు ఈ 2,324 ఎకరాల విస్తీర్ణం ఓ అభయారణ్యంగా ఉందని చెబుతున్నారు.
జీవ వైవిధ్యానికి ఆలవాలం..
విశ్వవిద్యాలయ పరిశోధకుల సమాచారం మేరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ లో 700కు పైగా పుష్పించే మొక్కలు, 10 జాతుల క్షీరదాలు, 15 జాతుల సరీసృపాలు, 200కు పైగా పక్షి జాతులకు నిలయం. అంతేకాకుండా వంద కోట్ల ఏళ్ల నాటి రాతి నిర్మాణాలు కూడా ఉన్నాయి. సాధారణంగా కనిపించే క్షీరదాలలో మచ్చల జింకలు, అడవి పందులు, ముళ్లపందులు, కుందేళ్లు ఉన్నాయి. వేటతో పాంగోలిన్లు ఇప్పటికే అదృశ్యమయ్యాయి. సరీసృపాలలో, రస్సెల్స్ వైపర్, కోబ్రా, ఇండియన్ రాక్ పైథాన్, ఇండియన్ క్రైట్స్, మానిటర్ బల్లి ఇంకా క్యాంపస్‌లోనే ఉన్నాయి. ఇక విశ్వవిద్యాలయ జీవ వైవిధ్యంలో 200కు పైగా పక్షి జాతులు ఉన్నాయి, వాటిలో చాలా వలస పక్షులు అంతరించిపోతున్నాయి, వీటిలో రాబందులు, గద్దలు , కొంగలు, కార్మోరెంట్స్, హెరాన్లు, ఐబిస్, ఫ్లెమింగోలు, ఇండియన్ పిట్ట , పెలికాన్లు ఉన్నాయి. హిమాలయాల నుంచి వలస వచ్చే అరుదైన పక్షి వెర్డిటర్ ఫ్లైక్యాచర్ను ఈ క్యాంపస్‌లో పక్షుల పరిశీలకులు, వన్యప్రాణుల ఔత్సాహికులు గుర్తించారు. ప్రధానంగా రెండు నీటి వనరులు నెమలి సరస్సు, గేదెల సరస్సుతో పాటు వన్యప్రాణులకు దాహార్తి తీర్చే మరో మూడు చెరువులపై ఇప్పుడు బుల్డోజర్ కరాళ నృత్యం చేయడం పర్యావరణానికి ముప్పుగా మారనుంది.
అద్భుత ఔషధాల చిరునామా..
వర్సిటీ ప్రాంతంలోని వనాల్లో అనేక ఔషధ, సుగంధ మొక్కలు పరిశోధకులు, శాస్త్రవేత్తలకు ప్రధాన ఆధారం. ప్రత్యేక ఆసక్తికి కీలకం. అలాంగియం సాల్విఫోలియం (బీపీని తగ్గించే లక్షణాలను కలిగి పేగుల పెరిస్టాల్టిక్ కదలికను పెంచుతుంది), ఆండ్రోగ్రాఫిస్ పానికులాటా నీస్ (కాలేయాన్ని సరిదిద్దడంలో రక్షించడంలో సమర్థవంత ఆయుర్వేద వైద్యం) ఇవి కాకుండా విశ్వవిద్యాలయంలో అనేక ఔషధ మొక్కలు న్నాయి. ఈ క్యాంపస్ ఒక పురాతన శిలా నిర్మాణం మష్రూమ్ రాక్ కు నిలయంగా ఉంది, ఇది దక్కన్ భౌగోళిక చరిత్రకు చిహ్నంగా ఉద్భవించింది. ఈ క్యాంపస్‌లోని జంతుజాలాన్ని పరిశీలిద్దాం, నెమలి, మచ్చల జింక, నక్షత్ర తాబేలు. ఫ్లాప్ పెంకులు, అడవి పందులు, చెవుల పిల్లి, కుందేలు, బూడిద రంగు ముంగిస, ముళ్లపందులు, మానిటర్ బల్లులు, కొండశిలువ, బోవా పాములు, నాగుపాము, రస్సెల్స్ వైపర్ , కట్లపాము వంటివి ఉన్నాయి.
రెండు వందల కోట్ల ఏళ్లనాటి శిల..
సొసైటీ టు సేవ్ రాక్స్ కార్యదర్శి ఫ్రాక్ క్వాడర్ వాదన ప్రకారం.. హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పుట్టగొడుగుల శిల నిర్మాణం, కనీసం 200 కోట్ల సంవత్సరాల నాటిది. ఈ శిల భూమి పొర నుండి ఏర్పడిందని ఫ్రౌక్ చెప్పారు. “ఇది హైదరాబాద్‌లోని ప్రత్యేకమైన శిల నిర్మాణాల్లో ఒకటి. పుట్టగొడుగుల శిలలను రక్షించి, ప్రకృతి దృశ్యాలు తీర్చిదిద్దుతామని టీజీ హెచ్ సీ తెలియజేసింది” అని ఆమె వివరించారు. ఈ శిల చుట్టూ ఉన్న ఏదైనా నిర్మాణ కార్యకలాపాలు పురాతన నిర్మాణానికి ముప్పుగా మారవచ్చు. నిర్మాణాలతో పెద్ద ఎత్తున కంపనాలతో శిల చెదిరిపోయే అవకాశం ఉంది. పుట్టగొడుగుల శిల చుట్టూ ఎటువంటి నిర్మాణ కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాలి” అని ఆమె స్పష్టం చేశారు.
కట్టడాలతో పెను ప్రమాదమే..
చికాగో నార్త్ వెస్ట్రన్ యూనివర్శిటీ పరిశోధన సహచరుడిగా పనిచేస్తున్న పూర్వ విద్యార్థి వ్యవస్థాపకుడు వైల్డ్‌లెన్స్ డాక్టర్ రవి జిల్లాపల్లి, ఈ భూమిలో ఏదైనా కార్యకలాపాలు కాలుష్యాన్ని పెంచుతాయని అన్నారు. ఫ్లెమింగోలు , వెర్డిటర్ ఫ్లైక్యాచర్ వంటి వన్యప్రాణుల వలస పక్షులను ప్రభావితం చేస్తాయని వాదిస్తున్నారు. ఇది విశ్వవిద్యాలయం మొత్తం గొప్ప జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తుందన్నారు.

