Top Story | మణుగూరును నాకేసిన మాజీ జెడ్పీటీసీ

అవినీతిని కొత్తపుంతలు తొక్కించిన నాయకుడు
రియల్‌ దందా.. అవినీతి.. అక్రమార్జనలో మేటి
నెంబర్‌-2 అంటూ ప్రచారం – అవినీతిలో అగ్రస్థానం
ఆయన శిష్యుడూ.. అవినీతికి వారసుడే..
వారిద్దరి పాపం – మణుగూరు ప్రజలకు శాపం

ఆంధ్రప్రభ బ్యూరో, భద్రాద్రి కొత్తగూడెం కంచె చేను మేసిన చందాన రాజ్యాంగం కల్పించిన అవకాశంతో మణుగూరు జడ్పీటీసీగా విధులు నిర్వహించిన ఓ అవినీతి సామ్రాట్‌ మణుగూరును పూర్తిస్థాయిలో నాకేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీటీపీఎస్‌ నిర్మాణం వలన వచ్చిన క్రేజ్‌, పెరిగిన భూమి విలువను అందివచ్చిన అవకాశంగా మలుచుకొని, మణుగూరు ప్రాంతంలో ఈ అవినీతి సామ్రాట్‌ అడ్డగోలుగా దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మణుగూరులో రియల్‌ వ్యాపారానికి చుక్కలు చూపించిన ఘనత సైతం ఆ సార్‌కే దక్కుతుందని పలువురు బాధితులు పేర్కొంటున్నారు. యాభై ఏళ్ల చరిత్రలో ఏన్నడూ లేని విధంగా గిరిజనులు, గిరిజనేతరుల మధ్య భూ సమస్యలు సృష్టించడం, ఆయా సమస్యల పరిష్కారానికి పెద్ద మనిషిగా అవతారమెత్తడం, దానిని సెటిల్‌ చేసే పేరుతో భారీ మొత్తంలో దండుకోవడం ఆయన సాగించిన దాష్టికాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అరవై నెలల పదవీ కాలంలో ఆయన సాగించిన అక్రమాలు అన్నీఇన్నీ కావని తెలుస్తుండగా, ఐదేళ్లలోనే అపర కుబేరుడిగా, అవినీతి సామ్రాజ్యానికి రారాజుగా ఆ మాజీ జడ్పీటీసీ ఎదిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ సమస్యలు సృష్టించడంతో పాటు, అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి ఆయనకు అనుకూలంగా పని చేయించుకున్నట్లు తెలుస్తోంది.

నెంబర్‌-2 అంటూ ప్రచారం – అవినీతిలో అగ్రస్థానం

నియోజకవర్గంలో ఎందరో హేమాహేమీలున్నప్పటికీ, ఓ ప్రజా ప్రతినిధికి నమ్మినబంటుగా నటించిన సదరు అవినీతి సామ్రాట్‌ నెంబర్‌ 2 నేనేనంటూ ప్రచారం చేసుకున్నాడు. అటు అధికారులు, ఇటు పార్టీ నాయకులను మభ్యపెడుతూ అంతా తానై ముందుకు సాగాడు. ఈ క్రమంలోనే నాలుగు తరాలకు సరిపడా పోగేసినట్లు స్థానికులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో ఆయన సాగించిన అక్రమాలను కొనసాగించిన పాపానికి ప్రస్తుతం అధికారులు బలవుతున్నట్లు తెలుస్తోంది.

గురువును మించిన శిష్యుడు

అవినీతి సామ్రాజ్యానికి రారాజుగా మాజీ జడ్పీటీసీ ఎదిగితే, ఆయన అనుంగు శిష్యుడు సైతం ఏమాత్రం తీసిపోని రీతిలో కోట్లు కూడబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ వ్యాపారిగా తన జీవితాన్ని ఆరంభించిన శిష్యుడు గురువును తలదన్నే రీతిలో అవినీతి అక్రమాలకు తెగబడినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గతంలో లేని విధంగా అక్రమ దందా

ఈ గురుశిష్యులు సాగించిన అక్రమాలు, అవినీతి మణుగూరు అభివృద్ధికి ఆటంకంగా మారినట్లు తెలుస్తోంది. వారు నాటిన అవినీతి మొక్క, శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షంగా ఎదిగినట్లు తెలుస్తోంది. ఆయా అవినీతి అక్రమాల పరంపరను వారి వారసులుగా అవతారమెత్తిన వారు నేటికి కూడా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ శాఖల అధికారులు సైతం కాసుల కక్కుర్తితో, ప్రజలను, వ్యాపారవేత్తలను ఇబ్బందులకు గురిచేస్తూ మణుగూరును మసకబారుస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోనే భూదందాలు, సెటిల్‌మెంట్లు రికార్డుస్థాయిలో జరుగుతున్నాయి. కొంతమంది అవినీతికి అలవాటు పడి ఉపాధిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా ఆగడాలు మితిమీరిపోవడంతో రూ.15 లక్షలకు భూమి లావాదేవీలు జరిపిన ఓ రియల్టర్‌, దాదాపు రూ.35 లక్షల వరకు లంచాల రూపంలో అడిగిన వారందరికీ ఇవ్వాల్సి వచ్చిందని, పదే పదే ఒత్తిడి తెచ్చి కొన్ని శాఖల అధికారులు పెద్దమొత్తంలో దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విసుగు చెందిన బాధితులు ఏసీబీని ఆశ్రయించడం, ఏసీబీ జరిపిన దాడుల్లో ఒక సీఐ స్థాయి అధికారి రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం సంచలనంగా మారింది.

వారిద్దరి పాపం – మణుగూరు ప్రజలకు శాపం

అవినీతి సామ్రాజ్యంలో రారాజులుగా మారిన గురుశిష్యుల పాపం, వారి అవినీతి వారసుల రూపంలో మణుగూరు ప్రజలకు శాపంగా మారినట్లు తెలుస్తోంది. వారిద్దరి హయాంలో ప్రారంభమైన అరాచకాలు, ప్రస్తుతం మణుగూరు ప్రాంతంలో గజం స్థలం కొనాలంటే కూడా జనం వణికి పోతున్నారంటే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో రూ.కోటి పలికిన స్థలాలు సైతం నేడు పాతిక లక్షలకు అమ్ముడుపోని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. అలనాడు సెంట్‌ స్థలం రూ.లక్ష పలకగా, నేడు రూ.25 వేలకు కూడా ధైర్యంగా కొనలేని విషమ పరిస్థితులు ఎదురవుతున్నాయి. గతంలో భూమ్‌ నెలకొన్న నేపథ్యంలో పెరిగిన అద్దెలు, ప్రస్తుతం వ్యాపారాలు నడవని కారణంగా, అద్దెలు కూడా కట్టలేని స్థితికి వ్యాపారులు చేరుకుంటున్నారు. గతంలో పెట్టుబడి పెట్టిన వారంతా ఆయా భూములను తెగనమ్ముకొనేందుకు యత్నిస్తున్నా, కొనే నాథుడే కానరావడం లేదని తెలుస్తోంది. అవినీతి, అరాచకాలకు అడ్డుకట్ట పడక పోవడంతో ఇప్పటికీ ఆయా విధానాలు యదావిధిగా సాగుతున్నాయని మణుగూరు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరి ఇప్పటికైనా అక్రమార్కుల్లో మార్పురావాలని, అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడాలని కోరుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *