టమోటా ఫ్లూ !
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మానవ సమాజం మీదకు మరో కొత్త వైరస్ వచ్చింది. మూడేళ్ల కిందట దీన్నిని గుర్తించినప్పటికీ ఇప్పుడిప్పుడు ఈ వైరస్ ప్రభావితులు కనిపిస్తున్నారు. దీన్నిని టమోటా ఫ్లూ (టమోటో వైరస్) (Tomato virus) అంటారు. ఇది పన్నెండేళ్ల లోపు పిల్లలపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇదీ ప్రాణాంతకం కానప్పటికీ వైరస్ సోకకుండా స్వీయ చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ వైరస్ వెలుగు చూసింది. ఈ వైరస్ బారినపడిన చిన్నారుల శరీరం, చేతులు, పాదాలు, అరికాళ్లు, మెడ కింద, నోటిలో ఎర్రటి దద్దుర్లుగా మొదలై.. తర్వాత పెద్ద బొబ్బలుగా మారుతున్నాయి. దురద, మంట, నొప్పితో పాటు జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు బయటపడుతున్నాయి. ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ వైరస్ కేసులు కేరళలతో పాటు తమిళనాడు, ఒడిశా, హర్యానాలోనూ నమోదవుతున్నాయి.
హెచ్ఎఫ్ఎండీ…
“ఈ టమోటా ఫ్లూ వైరస్‌ను హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజ్ (హెచ్ఎఫ్ఎండీ) (HFMD) అంటారు. ఎచినోకాకస్, కాక్స్‌సాకీ అనే వైరస్ వల్ల ఇది వ్యాప్తి చెందుతుంది.. 6 నెలల నుంచి 12 సంవత్సరాల వయసున్న చిన్నారుల్లో ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది ” అని పీడియాట్రిషియన్ చెబుతున్నారు. ఇది సాధారణ సమస్యేనని, పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఎటువంటి ప్రత్యేక చికిత్స అవసరం లేదని, వారం, పది రోజుల్లో ఈ వైరస్ దానంతట అదే తగ్గిపోతుందని వారు చెప్పారు. ఏదేమైనా వైరస్ సోకకుండా జాగ్రత్తలు మాత్రం తీసుకోవడం అవసరం.
కేరళ రాష్ట్రం కొల్లంలో తొలుత వెలుగు చూసిన వైరస్…
టమోటా ఫ్లూ (Tomato Flu) 2022 మేలో కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలో వైధ్యులు గుర్తించారు. సుమారు 80మంది చిన్నారులు ఈ వైరస్ బారినపడ్డారు. ఒడిషాలోనూ దాదాపు 320 మందికి పైగా పిల్లలకు వైరస్ సోకింది. ఇదొక వైరల్ ఇన్ఫెక్షన్. కాక్స్సాకీ వైరస్ ఏ16 వల్ల ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా 05-09 సం.ల వయస్సు లోపు పిల్లలపై మాత్రమే ప్రభావం చూపిస్తుంది.
ఇవీ లక్షణాలు…
జ్వరం ప్రారంభమైన ఒకటి లేదా రెండు రోజుల తర్వాత.. శరీరంపై చిన్న ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. అందుకే దీనిని టమోటో ఫ్లూ అంటారు. ఈ వైరస్ (virus) సోకితే తేలికపాటి జ్వరం, ఆకలి లేకపోవటం, అనారోగ్యం, తరచుగా గొంతు నొప్పి ఉంటాయి. అలాగే చర్మంపై ఎర్రటి పొక్కులు, బొబ్బలు వస్తాయి. ఇవి పొక్కులుగా, తరువాత కురుపులుగా మారుతాయి. పుండ్లు సాధారణంగా నాలుక, చిగుళ్లు, బుగ్గల లోపల, అరచేతులు, అరికాళ్లపై వస్తాయి. ఆ దదుర్లు వారికి చికాకును తెప్పిస్తాయి. ఈ వ్యాధి సోకిన పిల్లలు ఎక్కువగా డీ హైడ్రేషన్ కు గురవ్వడంతో డయేరియా, వాంతులు, నీరసం అయిపోవడం, ఒళ్లు నొప్పులు జ్వరం (fever) వంటివి సాధారణంగా వస్తాయి. ఇలాంటి లక్షణాలతో ఉన్న పిల్లలలో డెంగ్యూ, చికున్ గున్యా, జికా వైరస్, వరిసెల్లా-జోస్టర్ వైరస్, హెర్పెస్ నిర్ధారణ కోసం మాలిక్యులర్, సెరోలాజికల్ పరీక్షలు చేస్తారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్లు మినహాయించిన తర్వాత.. టొమాటో ఫ్లూ నిర్ధారణ చేస్తారు.
స్వీయ నియంత్రణ పరిష్కారమార్గం…
ప్రస్తుతానికి ఈ వ్యాధికి సరైన మందులు అందుబాటులో లేవు, స్వీయ నియంత్రణ ఒక్కటే పరిష్కార మార్గం. శిశువులు, చిన్నపిల్లలపై ఈ వ్యాధి ప్రభావం ఎక్కువ కావున వారిపై తల్లిద్రండులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. పిల్లలు అపరిశుభ్రమైన ఉపరితలాలను తాకడం, నేరుగా నోటిలోకి వస్తువులను, చేతులను పెట్టుకోవడం వంటి వాటికి చేయకుండా చూడాలి. దీనికి చికిత్స ఇతర వైరల్ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటుంది కాబట్టి ఐసోలేషన్ (Isolation) లో ఉండటం, విశ్రాంతి తీసుకోవడం, ఎక్కువగా డాక్టర్లు సూచించిన పళ్ల రసాలు, ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఇతర పిల్లలకు లేదా పెద్దలకు వ్యాధి సోకకుండా నిరోధించడానికి ఏదైనా లక్షణం కనిపించినప్పటి నుంచి ఐదు నుంచి ఏడు రోజుల పాటు రోగిని ఐసోలేషన్‌లో ఉంచాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలుః
ఈ వైరస్ సోకకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులు, నోటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. అందుకే వైరస్ ఉన్నవారి నుంచి వేరుగా ఉంచాలి. సంక్రమితులు వాడే వస్తువులను శానిటైజ్ (Sanitize) చేయాల్సి ఉంటుంది. మల, విసర్జనకు వెళ్లిన తరువాత కాళ్లు, చేతులు సరిగా కడుక్కోక పోవడం, మలం ఉన్న చోట తాకిన చేతులను నోట్లో పెట్టుకోవడం ద్వారా ఈ వైరస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. లాలాజలం వంటి శరీర స్రావాలతోనూ ఈ వ్యాధి వేగంగా సంక్రమిస్తుండడంతో తగు నివారణ చర్యలు పాటించాలి.
టమోటా ఫ్లూకి కరోనా వైరస్, మంకీపాక్స్, డెంగ్యూ, చికెన్ పాక్స్ లతో ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.