గ్యాస్ కొరతతో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి..

గ్యాస్ కొరతతో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి..
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా వ్యాప్తంగా సామాన్య ప్రజలకు వంట గ్యాస్ కొరతతో ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా వ్యవహరించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్ బాబుకు బీ.సీ సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షులు శేకుబోయిన సుబ్రమణ్యం మంగళవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా వంట గ్యాస్ డెలివరీ ఆలస్యం అవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు.
గ్యాస్ డెలివరీ అయిన 30 రోజుల తర్వాత బుకింగ్ చేసుకున్న వారికి సైతం డెలివరీకి 10 నుంచి 15 రోజులు అవుతున్నప్పటికీ వంట గ్యాస్ అందడం లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు బుక్ చేసుకున్నప్పటికీ ఆలస్యం అవ్వడం ఏమిటని ప్రశ్నించారు. అంతేకాకుండా టోల్ ఫ్రీ నెంబర్లకు సంబంధిత సమస్యను తెలియపరచడానికి కాల్ చేసినప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారని తెలిపారు.
వంట గ్యాస్ డెలివరీ జాప్యం వల్ల ప్రజలు తమ పనులను మానుకుని ఎండలో బారులు తీరి గ్యాస్ కంపెనీల వద్ద పడుతున్న ఇబ్బంది వర్ణనాతీతమన్నారు. అలాగే కమర్షియల్ బండలను నిలిపివేసినప్పటికీ హోటలలో గృహ అవసరాలకు వినియోగించె గ్యాస్ బండలు దర్శనం ఇవ్వడం బాధాకరమన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
కాబట్టి వంట గ్యాస్ సకాలంలో అందించడమే కాకుండా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సరైన స్పష్టతను ప్రజలకు అందించి ఆదుకోవాలని బి.సి సంక్షేమ సంఘం తరఫున డి.ఎస్.ఓ మోహన్ బాబు కు వినతి పత్రం సమర్పించినట్లుగా సుబ్రమణ్యం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జోగి శివ, భోగి రెడ్డి సుభాని, నిక్కు రాధాకృష్ణ, ఎన్. అన్సారి, బెల్లంకొండ రవి, పి.సాంబయ్య, చేబోయిన కోటయ్య తదితర బీ.సీ నాయకులు పాల్గొన్నారు.
