today ipl match |నేడు రాజ‌స్థాన్‌, బెంగ‌ళూర్ ఢీ

today ipl match |నేడు రాజ‌స్థాన్‌, బెంగ‌ళూర్ ఢీ

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026లో ఇవాళ (శుక్ర‌వారం) బిగ్‌ఫైట్ జ‌ర‌గ‌నుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఢీకొనేందుకు సిద్ధ‌మ‌య్యాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్, JioCinema (జియో హాట్‌స్టార్) చూడ‌వ‌చ్చు.

ఈ రోజు జ‌రిగే మ్యాచ్‌లో సీనియ‌ర్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ, ప‌దిహేనేళ్ల చిచ్చ‌ర పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీపైనే అంద‌రి క‌ళ్లు ఉన్నాయి. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రు పై చేయి సాధిస్తారోన‌నే ఆస‌క్తి నెల‌కొంది. వ‌ర‌ల్డ్ బెస్ట్ బౌల‌ర్ బుమ్రా లాంటి బౌలర్‌ను ఉతికారేసిన వైభ‌వ్‌.. ఈ మ్యాచులో ఎలా ఆడ‌తాడా అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు. బలమైన బౌలింగ్ ఉన్న ముంబైని ఓ ఆట ఆడుకున్నాడు. ఇక బెంగళూరు బౌల‌ర్ల‌ను ఎలా ఎదుర్కొంటాడా అనే ఉత్కంఠ‌ను రేపుతోంది. దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీ ఎదుట బుడ్డోడి ఆట ఎలా ఉంటుందా అని అభిమానుల్లో ఆసక్తికర చ‌ర్చ మొద‌లైంది.

బెంగళూరు జట్టులోనూ కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ వంటి దిగ్గజ బౌలర్లతోపాటు అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, రొమారియో షెపర్డ్ వంటి బౌలర్లు ఉన్నారు. ఈ ఐదుగురు బౌలింగ్‌లో వైభవ్ ఎలాంటి దూకుడును చూపిస్తాడా అనేది చూడాలంటే మ‌రికొన్ని గంట‌లు ఆగాల్సిందే.

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ జట్టు వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్ విభాగాలు ప్రమాదకరంగా ఉన్నాయి. ఓపెన‌ర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ జోడీ విధ్వంసం సృష్టిస్తున్నారు. అదిరిపోయే ఆరంభాలు ఇస్తున్నారు. బెంగళూరు జట్టుకు కొండంత అండ విరాట్ కోహ్లీ. ఆయ‌న సూప‌ర్ ఫామ్‌లో ఉన్నారు. బెంగళూరు ఓపెనర్లు విరాట్, ఫిల్ సాల్ట్ జోడీ కూడా పదికి పైగా రన్ రేట్‌తో ప‌రుగులు చేస్తూ జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

తుది జట్ల అంచనా..

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రవీంద్ర జడేజా, డోనోవన్ ఫెరీరా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ.

Leave a Reply