కరువు కాటకాలతో సహజీవనం చేసే జిల్లా ఇదే..
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.
రాయలసీమ జిల్లాల్లోని ఒకటైన చిత్తూరు జిల్లా ప్రజలు నిత్యం కరువు కాటకాలతో సహజీవనం చేస్తుంటారు. జిల్లాలో భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, జీవ నదులు లేకపోవడంతో వర్షాల మీదనే ఆధారపడి వ్యవసాయం చేస్తుంటారు. చిత్తూరు జిల్లాలో సకాలంలో వర్షాలు పడతాయన్న నమ్మకం లేదు. ఒక సంవత్సరం అనావృష్టి మరో సంవత్సరం అతివృష్టి కారణంగా రైతాంగం తరచుగా నష్టపోతోంది. అప్పుడప్పుడు వచ్చే తుఫానుల కారణంగా భారీ వర్షాలు నమోదు అవుతాయి. ఫలితంగా చెరువులు, కుంటలు నిండుతాయి. నష్టాలు, కష్టాల సంగతి ఎలా ఉన్నా సంవత్సరం రోజుల పాటు జిల్లా వాసులకు సాగునీరు, తాగునీరు ఇబ్బందుల నుంచి తుఫానులు ప్రజలను గట్టున పడేస్తున్నాయి. గత ఆరు సంవత్సరాలలో చిత్తూరు జిల్లాలో దాదాపు ఐదు ముఖ్యమైన తుఫానులు తమ ప్రభావాన్ని చూపాయి. ఒక్కో తుఫాను ప్రభావం మూడు నుంచి ఐదు రోజులు కొనసాగింది. తుఫానుల కారణంగా వర్షపాతం, వరదలు సంభవించి రైతులకు భారీగా పంట నష్టాన్ని కలగజేస్తున్నాయి. అలాగే రోడ్లు, వంతెనలు, చెరువులు, కుంటలు దెబ్బ తినడం కారణంగా జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రాత్రిపూట కూడా అంధకారంలో దోమలతో సహజీవనం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. భారీగా ప్రభుత్వ ఆస్తులకు కూడా నష్టం జరుగుతోంది.
2020 నవంబర్ నిదర్ తుఫాను చిత్తూరు జిల్లాలో పలకరించింది. దీని ప్రభావం మూడు రోజుల పాటు కొనసాగింది. దాదాపు 1.12 లక్షల మంది ప్రజలపై ప్రభావం పడింది. చిత్తూరుకు కనీసం రూ. 100 కోట్లు ప్రభుత్వ ఆస్తులకు, పంటలకు నష్టం జరిగింది. 2021 సెప్టెంబర్ లో వచ్చిన గులాబ్ తుఫాను 4 రోజులు తన ప్రభావాన్ని చూపింది. భారీగా వర్షాలు పడ్డాయి.. వరదలు వచ్చాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో మాత్రమే రూ. 150-180 కోట్లు పంట, విద్యుత్, రహదారుల నష్టం జరిగింది. 2022 డిసెంబర్ లో మండౌస్ తుఫాను వచ్చి 5 రోజుల పైగా జిల్లాను అతలాకుతలం చేసింది. జిల్లాకు భారీ నష్టాలను మిగిల్చింది. 2023 డిసెంబర్ లో మికంగ్ తుఫాను 5 రోజులుn కొనసాగింది. భారీ వర్షాలతో రోడ్లు, పంటలు దెబ్బతిన్నాయి. పంటలకు, రైతులకు భారీగా దాదాపు రూ. 200 కోట్ల వరకూ నష్టం జరిగిందని అంచనా. భారీ వరదలు, రహదారి నష్టం అధికంగా నమోదైంది.
ప్రస్తుతం వచ్చిన మొందా తుఫాను ప్రభావం 4 రోజులు ఉంటుందని అంచనా. రాబోయే 48 గంటల ప్రభావం మరింత తీవ్రమవుతుందని అంచనా. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వరదలు వస్తాయని అంచనా వేస్తున్నారు. అంచనా ప్రకారం పంటలు, చెరువులు, వాటర్ వర్క్స్, రోడ్లు నష్టాల వలన రూ. 60-100 కోట్ల దాకా నష్టం ఏర్పడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. తుఫాన్ల ప్రభావం కారణంగా జిల్లాలోని రైతాంగం ప్రతి సంవత్సరం భారీగా నష్టపోతున్నారు. పంటలు పాడవుతున్నాయి. తూర్పు మండలాల్లో ఎక్కువ నష్టం జరుగుతోంది. రోడ్డు దెబ్బతినడం కారణంగా రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. రోజువారీ కూలీలకు ఉపాధి దెబ్బతింటోంది. ముఖ్యంగా చిరువర్తకులు, బండ్ల మీద వ్యాపారం చేసేవాళ్ళు, ఇంటింటికి తిరిగి కూరగాయలు అమ్ముకునేవారు తీవ్రంగా నష్టపోతున్నారు. భవన నిర్మాణాలు ఆగిపోతున్నాయి. ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు పస్తులతో కాలం గడిపించిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
విద్యుత్తు, నీటి సరఫరా వ్యవస్థల మీద ఈ ప్రభావం పడుతుంది. పలుచోట్ల విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో ప్రజలు తాగునీటి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, రాష్ట్ర యంత్రాంగం, పోలీస్, రెవెన్యూ, మునిసిపల్ అధికారులు సమష్టిగా ప్రజలను ఆదుకోవడానికి శాయశక్తుల కృషి చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ లాంటి సంస్థలు అవసరమైన ప్రాంతాలకు పాలు, ఆహార పదార్థాలు, దుస్తులు, తినుబండారాలు, నీటి సరఫరా, వైద్య సహాయం, పునరావాస చర్యల్లో పాల్గొన్నాయి. రెవెన్యూ పోలీస్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. భారీ వర్షాలు తుఫానులు సంభవించినప్పుడు అసంఘటిత రంగ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వారం, పది రోజుల పాటు వారికి ఉపాధి అవకాశాలు లభించవు. ముందుగా ఆహార పదార్థాలు నిల్వ ఉంచుకోకపోవడంతో కొన్ని కుటుంబాలు వస్తువులతోనే కాలం గడపలు చిన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వం అత్యవసర వస్తువులను కొంత మొత్తాన్ని సహాయం అందజేస్తుంది.

