- మొగలాయిల సంబరం
- భక్తులు సిద్ధం
- భారీ బందోబస్తుతో
- పోలీసులు రెడీ
కర్నూలు , ఆంధ్రప్రభ బ్యూరో : దసరా సందర్భంగా జరిగే దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి బన్ని ఉత్సవం అక్టోబర్ 2వ తేదీ రాత్రి అంగరంగ వైభవంగా జరగనుంది. దసరా వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు ఇప్పటికే ముహూర్తాలు నిర్ణయించారు. ఆలయ ప్రాంగణం మళ్లీ మొగలాయిల ఉత్సాహంతో మార్మోగనుంది.
భక్తి – ఉత్సాహం – ఉత్కంఠ:
లక్షలాది మంది భక్తులు ప్రతి ఏటా తరలివచ్చే ఈ ఉత్సవం మానవ సముదాయంగా మారుతుంది. నెరణికి, నెరణికి తండా, కొత్తపేటతో పాటు వివిధ గ్రామాల భక్తులు కల్యాణోత్సవానికి పాలబాసలు తీసుకొని దేవరగట్టుకు చేరుకుంటారు. మల్లేశ్వరస్వామి, మాతమాళమ్మల ఉత్సవమూర్తులకు అర్ధరాత్రి కల్యాణం జరిపి జైత్రయాత్ర ప్రారంభిస్తారు.
కర్రల కడపట… మొగలాయిలో మునిగిపోతున్న భక్తులు:
ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ మొగలాయి – భక్తులు చేతుల్లో రింగు కర్రలు పట్టుకొని ఒకరిపై ఒకరు ఊహించలేని ఉత్సాహంతో కొట్టుకుంటారు. స్వామి విగ్రహాలను తాకేందుకు చేసే ప్రయత్నంలో ఒక్కోసారి గాయాలు తప్పవు. గతంలో మృత్యువుతో ముగిసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇది ఆధ్యాత్మిక ఉత్సాహంగా భావించి భక్తులు దానిని స్వాగతిస్తారు.
రక్తసంతర్పణ ఆచారం – తలరాత తెలుపు:
విగ్రహాలు రక్షపడికి చేరిన తర్వాత మణి, మల్లాసుర రాక్షసులుగా భావించే రాతి గుళ్లకు గొరువయ్య అనే భక్తుడు రక్త సంతర్పణ సమర్పిస్తాడు. ఆపై ఆలయ ప్రధాన అర్చకుడు గిరిస్వామి భక్తులకు భవిష్యవాణి చెబుతారు. వాణిజ్య పంటల ధరలు, వర్షాభావం, రాజకీయ మార్పులు వంటి అంశాలపై భవిష్య వాక్యాలు వినిపిస్తారు. భక్తుల మధ్య నిశ్శబ్దం నెలకొనడం ఈ సందర్భంగా ఆసక్తికర దృశ్యం.
భద్రత కట్టుదిట్టం:
ఈ ఉత్సవంలో భారీ సంఖ్యలో గాయాలు జరగడం సాధారణం. అందువల్ల 800 మంది సివిల్ పోలీసులు, మహిళా పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలు, డిఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు కలుపుకొని 1,200 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు, వీడియో కెమెరాలతో పరిస్థితిని 24 గంటలూ పర్యవేక్షించనున్నారు. గాయపడిన భక్తులకు వైద్య సహాయం అందించేందుకు హెల్త్ క్యాంప్, డాక్టర్లు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు.
ఉత్సవం వెనకటి చరిత్ర:
ఈ ఉత్సవానికి వేరియే పునాది ఉంది. పురాతన కాలంలో కొండపైకి వెళ్లే భక్తులు విషజంతువుల నుంచి రక్షణ కోసం కర్రలు, దివిటీలు తీసుకెళ్లేవారు. అయితే గ్రామ స్థాయిలో వ్యక్తిగత కక్షలు కలిసిపోయి, చీకటిలో కర్రలతో ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాలు ఈ ఉత్సవాన్ని “కర్రల సమరం”గా మార్చాయి. కొంతమంది భక్తులు దేవుడిని తాకేందుకు కర్రలు వినియోగించగా, మరికొంతమంది ఉద్దేశపూర్వకంగా దాడులకు దిగారు. ప్రభుత్వం, ఆలయ అధికారులు ఈ విధానాన్ని నియంత్రించేందుకు ప్రతి సంవత్సరం చర్యలు తీసుకుంటున్నప్పటికీ, సంప్రదాయం పేరుతో ఈ ఘర్షణలు ఇంకా కొనసాగుతున్నాయి.
దేవరగట్టుకు ఇలా వెళ్లాలి:
దేవరగట్టు ఆలయం కర్నూలు నుంచి 120 కి.మీ. దూరంలో ఉంది. కర్నూలు – ఆలూరు మీదుగా ప్రయాణించి అరికెర మార్గంగా చేరుకోవచ్చు. కర్ణాటకవాసులు హొళగుంద మీదుగా రావచ్చు. ఆలూరు, హొళగుంద వరకు బస్సులు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి ప్రైవేటు వాహనాలు ఉపయోగించాలి.
పోలీసుల ముఖ్య సూచన:
భక్తులు ఆలయ కమిటీ ప్రకటించిన ముహూర్తాలను గౌరవిస్తూ, పోలీసుల సూచనలు పాటిస్తూ, సంయమనంతో ఉత్సవాన్ని ఆస్వాదించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. దివిటీలు, మద్యం, రింగుకర్రల వినియోగం నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భక్తులు ఆరోగ్యభద్రతా సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. దసరా రోజు రాత్రి జరిగే దేవరగట్టు మళ్లీ రక్తపు మొగలాయిలో మునిగిపోనుంది… కానీ భక్తిశ్రద్ధలతో, భద్రతతో ఈ సంప్రదాయం కొనసాగాలని అందరి ఆకాంక్ష.


