పూజ గదిలో కర్టెన్ కు దీపం అంటుకుని…

పూజ గదిలో కర్టెన్ కు దీపం అంటుకుని…
ఇబ్రహీంపట్నం (ఎన్టీఆర్ జిల్లా ) ఆంధ్రప్రభ : ఎన్టీటీపీఎస్ ఏ కాలనీ క్వార్టర్స్ లో ఈ రోజు అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో అదృష్టవశాత్తు ఇద్దరు చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. సేకరించిన సమాచారం ప్రకారం ఎన్టీటీపీఎస్ లో దివ్య ఏఈగా పనిచేస్తున్నారు. ఆమె భర్త వేరొక చోట ఉద్యోగం చేస్తున్నారు. ఏ కాలనీ క్వార్టర్ మొదటి అంతస్థు జేఈ(First Floor JE) 125 నంబర్ దివ్య, ఆమె ఎనిమిది, ఆరు సంవత్సరాల ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. బుధవారం ఉదయం పూజ గదిలో దీపం వెలిగించిన దివ్య పిల్లలను బెడ్ రూమ్ లో వదిలి క్వార్టర్ కు తాళం వేసి సమీపంలోని ఆలయానికి వెళ్లింది.
పూజా సమయంలో వెలిగించిన దీపం కర్టెన్ కు అంటుకుని మంటలు వ్యాపించాయి. పూజ గది పక్కనే ఉన్న మంచం, ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి. మంటలు, దట్టమైన పొగ ధాటికి మరో బెడ్ రూంలో ఉన్న ఇద్దరు చిన్నారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. బిగ్గరగా కేకలు వేయడంతో క్వార్టర్(Quarter) ఎదురుగా ఉన్న నివాసితులు అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎన్టీటీపీఎస్ డివిజనల్ ఫైర్ ఆఫీసర్ శాస్త్రికి విషయం చెప్పారు. ఆయన వెంటనే ఎన్టీటీపీఎస్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇంతలోనే సమీపంలోని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రమాదానికి గురైన క్వార్టర్ తలుపు పగులగొట్టి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. అప్పటికే భయభ్రాంతులతో హాహాకారాలు చేస్తున్న ఇద్దరు చిన్నారులను ఏడీఎఫ్ వో రాజశేఖరరెడ్డి, ఎస్ ఎఫ్ వో శివశంకర్ రెడ్డి(SFO Sivashankar Reddy) చాకచక్యంగా వ్యవహరించి రక్షించారు. వారిని చికిత్స నిమిత్తం విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. క్వార్టర్ కు వ్యాపించిన మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
