తీర్మానం ఉంది అందుకే చెల్లించాం..

  • ఎంపీడీవో వివరణ

శావల్యాపురం, ఆంధ్రప్రభ : పొట్లూరు గ్రామంలో అభివృద్ధి పనులకు పంచాయతీ తీర్మానం ప్రకారమే నిధులు చెల్లించామని శావల్యపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి సీతారామయ్య అన్నారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కార్యదర్శి నిధులు డ్రా చేశారని పొట్లూరు సర్పంచ్ పోపూరి జ్యోతి అభియోగాలపై ఎంపీడీవో సీతారామయ్య సోమవారం వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ లో జరుగు ప్రభుత్వ కార్యక్రమాలకు గ్రామ సర్పంచ్ హాజరుకాకపోగా గ్రామాభివృద్ధికి సహకరించడం లేదన్నారు.

గ్రామ పరిశుభ్రం, పారిశుధ్యం, వీధి దీపాల పనులలో పంచాయతీ కార్యదర్శికి సహకరించడం లేదన్నారు. గ్రామ ప్రజలు ఈ విషయంపై కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని తెలియజేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో 15 లక్షల రూపాయలతో సైడ్ కాలువల నిర్మాణం చేపట్టడం జరిగిందని, పనులకు సంబంధించిన ఎం బుక్ సర్పంచి తన వద్దనే దాచుకున్నారని, ఎం బుక్ ఇవ్వకుండా బిల్లులు చేయమంటే ఎలా అని ప్రశ్నించారు.

నవంబర్ 15న నాలుగు పనులకు సంబంధించిన రూ.7,38,000 లు బిల్లులు చెల్లింపునకు చెక్ మెమో తయారుచేశామని, పంచాయతీ కార్యదర్శికి అనారోగ్య కారణంగా అందుబాటులో లేనందున బిల్లుల చెల్లింపులు ఆలస్యం జరిగిందని పేర్కొన్నారు. నవంబర్ 22న రూ. 3,94,000 లు అకౌంట్ లో జమ చేసినట్లు మిగిలిన బిల్లులను త్వరలో చెల్లిస్తామన్నారు.

గ్రామపంచాయతీ రికార్డులు, తీర్మాన పుస్తకం, ఎం బుక్ లు తన వద్దనే ఉంచుకొని పంచాయతీ కార్యదర్శులకు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. విధి నిర్వహణలో పంచాయతీ కార్యదర్శి ఏదైనా తప్పులు చేసి ఉంటే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఈవోపీఆర్డి వివేకానంద మాట్లాడుతూ సంతకాన్ని ఫోర్జరీ చేసి నిధులు డ్రా చేయడం అనేది గ్రామపంచాయతీలో వీలుకాదన్నారు.

విధులలో చేరిన మూడో రోజునే పనులకు సంబంధించిన బిల్లులు తీసుకువచ్చారని వాటిని సరిచూసి బిల్లులు మంజూరు చేస్తామని చెప్పినా వినకుండా ఎంబుక్కులు వెనక్కి తీసుకొని వెళ్లారని, నిబంధనలకు విరుద్ధంగా రికార్డులన్నీ తన వద్దనే ఉంచుకున్నాడన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు వేరొకరి సంతకంతో డ్రా చేయడం కుదరదు అన్నారు. సర్పంచ్ ప్రమేయం లేకుండా ఏ బిల్లు మంజూరు చేయలేదని ఈ సందర్భంగా తెలియజేశారు. వారితో పాటు పంచాయతీ కార్యదర్శి ఫ్రాన్సిస్ ఉన్నారు.

Leave a Reply