MOVIE | “హీరో” అనే పదం డ్రగ్ కంటే ప్రమాదకరం

MOVIE | “హీరో” అనే పదం డ్రగ్ కంటే ప్రమాదకరం

సామాజికవేత్త మాదాసు భాను ప్రసాద్
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ

MOVIE | చిలకలూరిపేట (ఆంధ్రప్రభ) : “హీరో” ఆరాధన వలన బాల్య దశ నుంచి మన యువత భవితకు నష్టం వాటిల్లుతున్నదని, ఆ పదం డ్రగ్ కంటే ప్రమాదకరంగా మారిందని, చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. సినిమాలో (Movie) నటించే వారిని లీడ్ యాక్టర్, లీడ్ యాక్ట్రెస్ అని కాకుండా హీరో అనే పదం వాడటం వలన హైస్కూల్ స్థాయి నుంచి కాలేజీ విద్యార్థుల వరకు అందరి మానసిక స్థితి పై తీవ్రమైన ప్రభావం చూపుతుందని లేఖలో పేర్కొన్నారు. ఆ కారణం చేత యువత విలువైన సమయాన్ని, బంగారు భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారని, సినిమాలో నటించే నటులు అభినయించే పాత్రలను బట్టి “కథానాయక పాత్రధారులు” లేక “హీరో పాత్రధారి” అని సంబోధించడానికి బదులుగా, నేటి ఎంటర్టైన్మెంట్ మీడియా “హీరో” అనే పదం ఉపయోగిస్తున్నారన్నారు. అంతేకాకుండా, సినిమాలోని లీడ్ యాక్టర్స్ వాళ్లకు వాళ్లే బిరుదుగా ఏదో ఒక స్టార్ అని పెట్టుకోవడం పరిపాటిగా మారిందన్నారు. విద్యార్థులు హైస్కూల్ స్థాయి నుండి హీరో పాత్రధారులను ఆరాధ్యులుగా భావిస్తున్నారనే విషయాన్ని గుర్తించడానికి మనకి చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు అని అన్నారు.

దేశం కోసం ప్రాణాలర్పించే సైనికుల కంటే, దేశానికి అన్నం పెట్టే రైతన్నల (Former) కంటే, తల్లిదండ్రుల కంటే ఆర్టిస్టుల ఎంతో గొప్ప వాళ్ళుగా చూస్తున్నారన్నారు. కథానాయక పాత్రధారులకి రూ.200 కోట్లు, రూ.300 కోట్లు రెమ్యూనరేషన్ కారణం చేత సినిమా ఖర్చు పెరిగిపోతుందని గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా, పది రూపాయల మొక్కజొన్న పేలాలు వేయించి సగటు ప్రేక్షకుడి దగ్గర రూ. 600 వరకు వసూలు చేస్తున్నారన్నారు. అందువలన సగటు ప్రేక్షకుడు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. సినిమా ఖర్చు పెరగడానికి ప్రధాన కారణమైన ప్రధాన పాత్రధారుల వేతనాలతో పాటు ఇతర పాత్రధారుల వేతనాలను నిర్ణయించుటకు పరిశ్రమ నిబంధనలను పాటించే విధంగా విధివిధానాలను ప్రభుత్వం రూపొందించి అమలు చేయాలి. ఈ విధివిధానాల అమలుపై పర్యవేక్షణ స్థాయి అధికారులతో కూడిన సంస్థలను ఏర్పాటు చేయాలి. ఎంటర్టైన్మెంట్ మీడియా క్రియేట్ చేసిన హైప్ వలనే కథానాయక పాత్రధారులు రూ.200 కోట్లు, రూ.300 కోట్లు ఒక్కొక్క సినిమాకు తీసుకుంటున్నారు. ఐబొమ్మ సినిమా పైరసీ చట్ట ప్రకారం నేరం అయినప్పటికీ సామాన్య ప్రజలు రవిని ఎంతలా అభిమానిస్తున్నారో మనం చూస్తున్నాం.

ఇప్పటికైనా ఎంటర్టైన్మెంట్ మీడియాలో కథానాయక పాత్రధారులు, హీరో (Hero) పాత్రధారి అని మాత్రమే సంబోధించే విధంగా చర్యలు తీసుకోవాలి. “హీరో” అనే పదం వాడటం ఆపాలని, అంతేకాకుండా నటులు వాళ్లకై వాళ్ళు పెట్టుకున్న స్టార్ అనే పదాలను పత్రికల్లో, ఎంటర్టైన్మెంట్ మీడియాలో నియంత్రించాలని కోరారు. థియేటర్‌లోకి కనీస అవసరాలు డ్రింకింగ్ వాటర్, బిస్కెట్స్ లాంటి స్నాక్స్ అనుమతించాలని, లేదా ఎమ్మార్పీ రేట్లుకు, డ్రింకింగ్ వాటర్, బిస్కెట్స్, స్నాక్స్ (ISI ధ్రువీకరించిన) అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నిబంధనల ప్రకారం వెహికిల్ స్టాండ్స్‌లో రుసుం వసూలు చేయరాదు. కానీ, ఆ నిబంధన ఎక్కడ అమలు కావడం లేదు, అమలు జరిగేలా చూడాలని, వెహికల్ స్టాండ్‌లో రుసుం చెల్లించనవసరం లేదు అని బోర్డులు ఏర్పాట్లు చేయాలని కోరారు. ఇప్పటికైనా ఆ దిశగా పటిష్టమైన చట్టాలు తీసుకురావాలని, తద్వారా యువత భవిత అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి మార్గం సుగమం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హరిప్రసాద్, మురకొండ వెంకట్రావు, వెంకటేశ్వర్ రెడ్డి, అడపా రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply