హామీలకే పరిమితమైన ‘స్కిల్ సెంటర్’..

హామీలకే పరిమితమైన ‘స్కిల్ సెంటర్’..
- రెండేళ్లు గడుస్తున్నా అడుగు ముందుకు పడని వైనం
- బెల్లంపల్లి ఐటీ కల సాకారమయ్యేదెప్పుడు?
- మంత్రి శ్రీధర్ బాబు ఇచ్చిన మాటపై యువత ఆశలు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణాన్ని ఐటీ రంగంలో అగ్రగామిగా నిలుపుతామన్న పాలకుల ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ తరపున బెల్లంపల్లిలో పర్యటించినప్పుడు, ఇక్కడ అత్యాధునిక ‘స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్’ (నైపుణ్య అభివృద్ధి కేంద్రం) ఏర్పాటు చేస్తామని ఘనంగా ప్రకటించారు. కానీ, ఆ హామీ ఇచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా, అడుగు ముందుకు పడకపోవడం పై స్థానిక నిరుద్యోగ యువతలో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.
సాంకేతిక నైపుణ్యం లేక ఉపాధికి దూరం: ప్రస్తుతం బెల్లంపల్లిలో రెండు ఐటీ కంపెనీలు కొనసాగుతున్నాయి. వీటిలో దాదాపు 200 మంది యువత ఉపాధి పొందుతున్నారు. సొంత ఊర్లోనే ఐటీ ఉద్యోగం చేయాలనే తపనతో వేలాది మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు ఇక్కడ వేచి చూస్తున్నారు. అయితే, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా శిక్షణ ఇచ్చే కేంద్రం అందుబాటులో లేకపోవడంతో యువత వెనుకబడిపోతోంది. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తే, మరిన్ని కంపెనీలు బెల్లంపల్లికి వచ్చే అవకాశం ఉందని, తద్వారా వేల మందికి ఉపాధి లభిస్తుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన: “ స్థానికంగానే ఐటీ కొలువు సాధించాలన్నది మా కల. కానీ ఇక్కడ శిక్షణ ఇచ్చే నాథుడే లేడు. మంత్రి హామీ ఇచ్చి రెండేళ్లు అవుతున్నా పట్టించుకోకపోవడం బాధాకరం” అని పలువురు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిక్షణ కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయలేక మధ్యతరగతి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణలు ప్రత్యేక చొరవ తీసుకుని, ఐటీ శాఖ మంత్రిపై ఒత్తిడి తెచ్చి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ పనులు ప్రారంభించాలని నియోజకవర్గ యువత డిమాండ్ చేస్తోంది.
