( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : కృష్ణమ్మ నది చెంత పుణ్యస్నానాలు… పితృదేవతలకు తర్పణం.. శంఖం పూరించే జంగమ దేవరల సందడి… ముక్కంటి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు.. తెల్లవారుజాము నుండే ప్రత్యేక అభిషేకాలు, పూజలు… మారు మోగిన శివనామస్మరణతో శైవ క్షేత్రాలన్నీ సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. హర హర మహాదేవ.. శంభో శంకర.. పాహిమాం పాహిమాం అంటూ పంచాక్షరి మంత్రం జిల్లా వ్యాప్తంగా ప్రతిధ్వనించింది. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన శివరాత్రి వేడుకలను భక్తులు పెద్ద ఎత్తున వైభవంగా నిర్వహించుకున్నారు. యావత్ భక్తకోటి మనసారా ఆరాధించే పరమ పవిత్రమైన పుణ్య దినం మైన బుధవారం శివరాత్రి రోజు తెల్లవారుజాము నుండే భక్తులు పుణ్యస్నానాల కోసం కృష్ణానది పరివాహక ప్రాంతాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలతో నగరంలోని ఘాట్లన్నీ కిటకిటలాడాయి. పుణ్య స్నానాల అనంతరం ఘాట్ల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో పితృదేవతలకు పిండ ప్రధానం తర్పణాలను వదిలిన భక్తులు, నిరుపేదలకు దానధర్మాలను చేశారు. అలాగే పరమశివుని దర్శనం కోసం సమీప ప్రాంతాల్లో ఉన్న శివాలయాలకు చేరుకున్న భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలను నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని శివాలయాల్లో బుధవారం వేకువ జాము నుండే మహా రుద్రాభిషేకాలు, కుంబాభిషేకాలతో పాటు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. శివాలయాల్లో పరమ శివునికి ప్రత్యేక పూజాభిషేకాలు చేసేందుకు వచ్చిన భక్తుల రద్దీతో ఆలయాలన్నీ కిక్కిరిశాయి. భక్తుల రాక దృష్ట్యా అన్ని ఏర్పాట్లను ముందస్తుగా ఆయా ఆలయ కమిటీలు ఏర్పాటు చేశాయి. అలాగే స్నాన ఘాట్ ల వద్ద ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లను చేసింది.