చిన్నశేష వాహనంపై ఊరేగిన స్వామి..

చిన్నశేష వాహనంపై ఊరేగిన స్వామి..
తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో (Srivari Salakatla Brahmotsavam) రెండో రోజు గురువారం ఉదయం శ్రీ మలయప్పస్వామి ఐదు తలల చిన్నశేష వాహనంపై గురువాయూరు శ్రీకృష్ణడి అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.
చిన్నశేష వాహనం – కుటుంబ శ్రేయస్సు…
చిన్నశేషుడిని వాసుకి (నాగలోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయస్సుతో పాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంస వాహనంపై స్వామి భక్తులను కటాక్షించనున్నారు. వాహనసేవలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు, సీవీఎస్వో మురళికృష్ణ పాల్గొన్నారు.
