పశ్చిమ ప్రజల భద్రతే ధ్యేయం..

  • కలెక్టర్ చదలవాడ నాగరాణి

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజల భద్రతే ధ్యేయంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను హెచ్చరించారు. గురువారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సంయుక్తంగా జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ, చేపట్టవలసిన చర్యలు, అక్రమణాల తొలగింపు, ఐరాడ్ వెబ్సైట్లో యాక్సిడెంట్ డెత్ కేసులు నమోదు, తదితర అంశాలపై పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బి, ఎన్ హెచ్, రవాణా శాఖల అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు.

తొలుత భీమవరం పట్టణంలోని ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలు, తీసుకోవలసిన చర్యలపై భీమవరం డిఎస్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమావేశంలో వివరించారు. ప్రధానంగా డిఎన్ఆర్ కాలేజ్ రోడ్డు, టౌన్ హాల్ రోడ్డు, ఆర్టీసీ డిపో వద్ద బైపాస్ రోడ్డు మూడు రోడ్లు నిర్మాణంలో ఉండటం కారణంగా పట్నంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందని తెలిపారు. మొత్తం ట్రాఫిక్ అంతా భీమవరం ప్రధాన రహదారుల నుండే వెళ్లవలసి వస్తున్నదని వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు ఎంతో విలువైనవని, ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు చేపట్టవలసిన చర్యలలో ఎట్టి పరిస్థితిలో రాజీ పడవద్దని పోలీస్ అధికారులను ఆదేశించారు. రోడ్డు భద్రతా చర్యల్లో లోటుపాట్లు కారణంగా ఎంతోమంది ప్రజలు, విద్యార్థులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

చిన్న చిన్న మార్పులతో రహదారుల భద్రత పెంచవచ్చని సూచించారు. ప్రస్తుతం భీమవరం పట్టణంలో నిర్మాణంలో ఉన్న మూడు రోడ్లను డిసెంబర్ 15 నాటికి కచ్చితంగా పూర్తిచేసి అందుబాటులో తీసుకురావాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

ఈ లోపుగా ట్రాఫిక్ నియంత్రణకు అనువైన పద్ధతులను అమలు చేస్తూ, కళాశాలలు, పాఠశాలల బస్సు రూట్స్ లో కొంత మార్పు తీసుకురావాలని సూచించారు. రోడ్డుకు ఇరుపక్కల హాకర్స్ తోపుడుబండ్లకు భీమవరం పట్టణంలోని ఒక ప్రాంతాన్ని చూపించి అన్నీ ఒక చోట ఉండి వ్యాపారం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు సూచించారు.

రోడ్డు ఇరువైపులా మార్జిన్ లో టూ వీలర్స్ పార్కింగ్, షాపుల వారి వస్తువుల ప్రదర్శన పూర్తిగా నియంత్రించాలని, దీనికి సంబంధించి పర్యవేక్షణకు పోలీస్, మున్సిపల్ అధికారులు సిబ్బందితో టీం లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. భీమవరంలో నానాటికి పెరుగుతున్న రద్దీ, ఇరుకైన మార్గాల కారణంగా తరచూ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని, వాహనదారులు కూడా ట్రాఫిక్ నియమ, నిబంధనలను తప్పకుండా పాటించాలన్నారు.

అడ్డదిడ్డంగా ప్రయాణించడం వలన మరింత రద్దీని మనమే సృష్టిస్తున్నామని ఇది సరైనది కాదని హెచ్చరించారు. త్రిబుల్ రైడింగ్, నో హెల్మెట్, ట్రక్కులు ఓవర్ స్పీడ్ కచ్చితంగా నియంత్రించడంతోపాటు, ఫైన్ లు కూడా వేయాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాలతో పాటు, హైవేలలో కూడా రోడ్డు మార్జిన్లలో వివిధ రకాల షాపులు ఎప్పటి వలన ట్రాఫిక్ అంతరాయం, రవాణా భద్రతకు విఘాతం కల్పిస్తున్నాయని వీటిని కూడా కచ్చితంగా తొలగించాల్సిందేనని ఆదేశించారు.

భీమవరం పట్టణంలో టూ టౌన్, త్రి టౌన్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, వన్ టౌన్ లో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రారంభించాల్సి ఉందన్నారు. ప్రతి పాఠశాల బస్సు, ట్రక్కు, ఆర్టీసీ బస్సులపై పెద్ద అక్షరాలతో “నా డ్రైవింగ్ లో లోపం ఉందా” అని రాయించడంతో పాటు, లోపం ఉంటే ఈ నెంబర్ కు కాల్ చేయండి అని కూడా వ్రాయించాలన్నారు.

హైవేలపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేయాలన్నారు. ట్రక్ డ్రైవర్లు రాష్ డ్రైవింగ్ తో కనిపిస్తే పోలీస్, రవాణా శాఖ అధికారులే జవాబుదారులన్నారు. రోడ్డు యాక్సిడెంట్లు కారణంగా మరణించిన వివరాలను ఎప్పటికప్పుడు ఐరాడ్ వెబ్సైట్లో అప్డేట్ చేయాలని, పెండింగ్ డేటాను వెంటనే అప్డేట్ చేసి నివేదిక సమర్పించాలన్నారు.

నడింపల్లి లో డ్రైనేజీ అక్రమణాల కారణంగా నీరు గ్రామంలోనికి చొచ్చుకొస్తున్నదని ఆ గ్రామస్తులు ఫిర్యాదు చేశారని, వెంటనే అక్రమ అక్రమణాలను తొలగించాలని ఆదేశించారు. పాలకొల్లు, తణుకు పట్టణాల్లో సంబంధిత ఎస్ హెచ్ ఓ లు సమావేశం దృష్టికి తీసుకువచ్చిన అంశాలను ఆర్ అండ్ బి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లా అంతట ట్రాఫిక్ కు అంతరాయం లేనివిధంగా తీసుకుని చర్యలకు జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని, ప్రజలకు సౌకర్యవంతమైన రవాణాన్ని కల్పించే బాధ్యత మీరు తీసుకోవాలని రెవిన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారులకు నొక్కి చెప్పారు.

జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి జిల్లాలో జనవరి నుండి నవంబర్ వరకు జరిగిన రోడ్డు యాక్సిడెంట్లు, తదితర వివరాలను సమావేశంలో వివరించారు. రోడ్డు భద్రతకు కట్టదుట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి టీం వర్క్ గా పని చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో భీమవరం డివిజన్ డిఎస్పీ ఆర్.జయసూర్య, తాడేపల్లిగూడెం డివిజన్ డీఎస్పీ డి.విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి,బి ఆర్ అండ్ బి ఎస్.ఇ శ్రీనివాసరావు, జిల్లా రవాణా శాఖ అధికారి ఎస్ఎండి కృష్ణారావు, 216 నేషనల్ హైవే పిడి బి శ్రీనివాస్, ఆర్ అండ్ బి 165 హైవే డిఈ ఎన్.శ్రీనివాసరావు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ కళ్యాణ చక్రవర్తి, తహాసిల్దార్ రావి రాంబాబు, జిల్లాలోని ఇతర ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply